Begin typing your search above and press return to search.

విజ‌య్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ అజిత్ ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   9 Oct 2015 7:32 AM GMT
విజ‌య్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ అజిత్ ఫ్యాన్స్‌
X


అభిమానం ఉండొచ్చు కానీ.. అది వెర్రితనంగా మారితేనే సమస్య. తమిళనాట విజయ్ - అజిత్ అభిమానుల మధ్య గొడవలు చూస్తే దాన్ని వెర్రితనం అనాలో, ఇంకేమైనా అనాలో తెలియదు. తమ హీరోల్ని అభిమానించడం వరకు ఓకే కానీ.. అవతలి హీరోకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పడి ఏడవడం అక్కడ మరీ శ్రుతి మించిపోతోంది. విజయ్ వేస్ట్ అని, అతడి ఫ్యాన్స్ మెంటల్స్ అని వీళ్లు.. అజిత్ డమ్మీ అని, అతడి అభిమానులకు పనీ పాట లేదని వాళ్లు.. ఇలా ఊరికే సోషల్ మీడియాలో పడి కొట్టేసుకోవడమే. ఈ గొడవలు అప్పుడప్పుడూ రోడ్ల మీదికి కూడా వెళ్లిపోతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో అజిత్ సినిమా ‘ఎన్నై అరిందాల్’ రిలీజైంది. ఆ సినిమా టీజర్ కి యూట్యూబులో రికార్డు స్థాయిలో హిట్లు, లైకులు వచ్చాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఎగిరెగిరి పడ్డారు. విజయ్ అభిమానులు అప్పుడు కొంచెం ఓపిక పట్టారు. రెండు నెలల కిందట ‘పులి’ టీజర్ వచ్చింది. అంతే అందరూ ఒక్కసారి యూట్యూబ్ మీద పడ్డారు. ఆ ట్రైలర్ ఏకంగా 75 లక్షల హిట్స్ తెచ్చుకుంది. అంతే కాక లక్ష లైకులు కొట్టించుకున్న తొలి ఇండియన్ ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. అప్పుడు విజయ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అజిత్ అభిమానుల్ని దూషిస్తూ హ్యాష్ ట్యాగులు పెట్టి హంగామా చేశారు. ఇరు వర్గాల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది.

సీన్ కట్ చేస్తే పులి సినిమా ఫ్లాప్ అయింది. అదే సమయంలో అజిత్ సినిమా ‘వేదాలం’ టీజర్ రిలీజ్ అయింది. ఇక అజిత్ అభిమానులు ఎలా ఊరుకుంటారు. తమ హీరో టీజర్ ను ‘సూపర్ హిట్’ చేయడాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. దీంతో కేవలం 18 గంటల్లోనే 10 లక్షల హిట్స్ తో ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచింది ‘వేదాలం’ టీజర్. అంతే కాదు.. ‘కత్తి’ ట్రైలర్ కి రెండు నెలలకు లక్ష లైకులొస్తే.. ‘వేదాలం’ టీజర్ కి కేవలం ఒక్క రోజులో లక్షకు పైగా లైకులొచ్చి పడ్డాయి. విశేషం ఏంటంటే.. విజయ్ అభిమానులు పనిగట్టుకుని ఈ టీజర్ కి 50 వేల దాకా ‘డిజ్ లైక్’లు కొట్టడం. మొత్తానికి ఈ రకంగా విజయ్ - అజిత్ అభిమానులకు మధ్య పెద్ద వారే నడుస్తోంది కొన్ని నెలలుగా.