Begin typing your search above and press return to search.

అజిత్-షాలిని జంట‌ను క‌లిపింది AK-47 కోడ్

By:  Tupaki Desk   |   25 April 2023 8:31 PM GMT
అజిత్-షాలిని జంట‌ను క‌లిపింది AK-47 కోడ్
X
త‌ళా అజిత్ కుమార్- ‍ షాలిని జంట అన్యోన్య‌త ప్రేమైక జీవ‌నం ఎప్పుడూ అభిమానుల‌కు స్ఫూర్తి. తమిళ చిత్ర పరిశ్రమలో ఆదర్శ‌ జంటగా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. అమర్కలం సినిమా సెట్స్ లో తొలిసారిగా కలిసిన వీరిద్దరూ ప్రేమ‌లో ప‌డ్డారు. అటుపై పెళ్లయింది. 23 ఏళ్లుగా కలిసి అంద‌మైన సంసార జీవ‌నాన్ని సాగించారు. నేడు ఈ జంట 23వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షల‌తో ప్రేమ‌ను కురిపిస్తున్నారు. # షాలినీఅజిత్ కుమార్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తూ అభిమానులు తమ ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.

వివాహ‌ వార్షికోత్సవం సంద‌ర్భంగా ఈ అంద‌మైన జంట‌ క్లాసిక్ లవ్ స్టోరీ తాలూకా గుట్టు ఒక‌టి ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. ఆసక్తికరంగా అజిత్.. షాలిని ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న‌ప్పుడు ఒక‌రి నుంచి ఒక‌రు దూరంగా ఉన్న‌ప్పుడు ఒక‌రితో ఒక‌రు కమ్యూనికేట్ చేయడానికి ప్రత్యేకమైన కోడ్ వ‌ర్డ్ ని ఉప‌యోగించేవారు. ఎందుకంటే షాలినితో పాటు ఎల్ల‌పుడూ ఆమె తల్లిదండ్రులు సినిమా సెట్స్ లో ఉంటారు. అప్పట్లో ఫోన్లు పెద్దగా వాడుకలో లేకపోవడంతో అజిత్ త‌న ప్రేయ‌సిని వ్యక్తిగతంగా కలవలేకపోయేవాడ‌ట‌. అయినా కానీ అత‌డు షాలినికి కాల్ చేయాలంటే ఒక రహస్య కోడ్ ను ఉప‌యోగించేవాడు. సవాళ్లు ఎదురైనా ఈ జంట‌ ప్రేమను రహస్యంగా ఉంచడంలో ఈ కోడ్ వ‌ర్డింగ్ సహాయపడింది.

నిరమ్ చిత్రంలో షాలిని- కుంచకో బోబన్ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. ఆ స‌మ‌యంలో వేరే చోటి నుంచి షాలిని సెట్ కి అజిత్ నుంచి కాల్ వ‌చ్చేది. కుంచాకో అప్ప‌ట్లోనే సోనీ ఎరిక్సన్ ఫోన్ ని ఉప‌యోగించేవాడు. ఆ ఫోన్ కి అజిత్ కాల్ చేసేవాడు. ఎందుకంటే షాలిని తల్లిదండ్రులు సెట్స్ లో ఎప్పుడూ త‌న‌తోనే ఉంటారు. అతను కుంచాకో నంబర్ కి కాల్ చేసినప్పుడల్లా షాలినిని పిల‌వ‌డానికి `సోనా AK-47 కాలింగ్` అనే పదాన్ని ఉపయోగించేవాడు. నీరం సినిమాలో షాలిని పాత్ర పేరు సోనా. ఏకే -47 అంటే అజిత్ కుమార్ అని కోడ్ అర్థం. ప్రియ‌మైన చెలికాడు ఏకే 47 కాల్ రాగానే సిగ్గుల మొగ్గ‌యిపోయి షాలిని అత‌డి కోసం ఫోన్ వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకొచ్చేసేది.

అయితే ఓసారి `ఏకే-47 కోడ్‌ వర్డ్` పై నీరం చిత్ర దర్శకుడు కమల్ కు అనుమానం వచ్చి కుంచాకోను అడిగాడు. ఆ సీక్రెట్ ని కమల్‌కి వెల్లడించాడు కుంచాకో. మరుసటి రోజు చిత్రీకరణలో విరామం సమయంలో దర్శకుడు షాలినిని పిలిచి ``AK-47 నుంచి ఇంకా కాల్ రాలేదా?`` అని ఆటపట్టించాడట‌. దీంతో షాలిని సిగ్గుప‌డిపోవ‌డం వ‌గైరా వగైరా స‌న్నివేశాలు సెట్లో క‌నిపించాయి.

తమ మొదటి సినిమా `అమర్ కలం` సెట్ లో షాలిని- అజిత్ కుమార్ ప్రేమ‌లో ప‌డ్డారు. పెళ్ల‌యి 23 సంవత్సరాలుగా అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె అనౌష్క ...కుమారుడు ఆద్విక్. ఒక సన్నివేశం చిత్రీకరణ సమయంలో అజిత్ ప్రమాదవశాత్తూ షాలిని చేతిని కోయడంతో గాయమైంది. అయితే ఆ గాయం మానే వర‌కూ ద‌గ్గ‌రుండి అజిత్ షాలినిని ఎంతో ప్రేమ‌గా చూసుకున్నాడు. షాలిని తన గాయంపై అజిత్ లో ఉన్న ఆందోళన త‌న‌ను ప్రేమగా చూసుకునే వైనం విప‌రీతంగా న‌చ్చేశాయిట‌. అప్ప‌టి నుంచి ఈ జంట న‌డుమ ప్రేమ క‌థ మొద‌లైంది. అనంత‌రం పెళ్లితో ఒక‌ట‌య్యారు. ఈ జంట తమ వ్యక్తిగత జీవితాలను ప్రైవేట్ గా మీడియాకు దూరంగా ఉంచడానికి ఇష్టపడతారు.