Begin typing your search above and press return to search.

తెలుగు మార్కెట్ పట్టదా సారూ..

By:  Tupaki Desk   |   17 Aug 2017 11:58 AM GMT
తెలుగు మార్కెట్ పట్టదా సారూ..
X
తమిళ హీరోలకు తెలుగు మార్కెట్ అంటే మహా ప్రీతి. రజినీకాంత్.. కమల్ హాసన్ లాంటి సీనియర్లు వేసిన పునాది మీద.. చాలామంది తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నారు. సూర్య లాంటి హీరోలైతే తెలుగు హీరోల్లాగే చలామణి అవుతారిక్కడ. విజయ్.. ధనుష్ లాంటి స్టార్లు తెలుగు మార్కెట్ కోసం చాలా చాలా కష్టపడి.. చివరికి అంతో ఇంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ తమిళంలో చాలా పెద్ద స్టార్ అయిన అజిత్ మాత్రం తెలుగులో మార్కెట్ విస్తరించుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు. నిజానికి సూర్య కంటే ముందే అజిత్ కు తెలుగులో కొంచెం బేస్ ఏర్పడింది.

90ల్లోనే ‘ప్రేమలేఖ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాడు అజిత్. ఆ పేరును ఉపయోగించుకుని తెలుగు మార్కెట్ మీద దృష్టిపెడితే మంచి స్థాయికి చేరేవాడేమో. కానీ ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ.. తమిళంలోనూ తన సినిమాల ప్రచారంలో పాల్గొనని అజిత్ తన సినిమాల తెలుగు వెర్షన్ల మీద ఎప్పుడూ దృష్టిపెట్టలేదు. రజినీ.. కమల్.. విజయ్ లాంటి హీరోలు తెలుగు రాష్ట్రాలకు వచ్చి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుని.. మార్కెట్ విస్తరించుకుంటున్నప్పటికీ అతనా పని చేయలేదు. దీంతో అజిత్ ఇక్కడ పాపులర్ కాలేదు. ఐతే తమిళంలో అతను చేసే సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు బాగానే ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లలో అజిత్ చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయి.. అతడి సినిమాలు సాధించే వసూళ్లు.. రికార్డులు పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. అజిత్ కొత్త సినిమా ‘వివేగం’ మీద సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

అజిత్ వచ్చి ఇక్కడ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే దీనికి బాగానే కలిసొచ్చే అవకాశముంది. ఇందుకోసం కొందరు టాలీవుడ్ ప్రముఖుల సాయం కూడా తీసుకోవచ్చు. కానీ అలా ఏమీ చేయలేదు. తెలుగు తారలెవ్వరినీ పిలవకుండా ‘వివేగం’ యూనిట్ సభ్యులే తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ చేశారు. నిజానికి ఈ చిత్ర దర్శకుడు శివ తెలుగులోనే కెరీర్ ఆరంభించాడు. ఇక్కడ శౌర్యం.. శంఖం.. దరువు సినిమాలు చేశాడు. తర్వాత తమిళంలోకి వెళ్లాడు. ఈ ఫ్యాక్టర్ కూడా ఈ చిత్ర ప్రచారానికి కలిసొచ్చేదే. కానీ పూర్ ప్లానింగ్.. ప్రమోషన్ వల్ల ‘వివేగం’ మీద తెలుగులో హైప్ క్రియేటవ్వలేదు. ప్రమోషనే లేకుండా నేరుగా తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తే పట్లేదెవరికి?