Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : విశ్వాసం

By:  Tupaki Desk   |   1 March 2019 12:49 PM GMT
మూవీ రివ్యూ : విశ్వాసం
X
‘విశ్వాసం’ మూవీ రివ్యూ

నటీనటులు: అజిత్ కుమార్-నయనతార-జగపతిబాబు-బేబీ అనిఖ-తంబి రామయ్య-రోబో శంకర్-వివేక్-యోగి బాబు తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: వెట్రి
మాటలు: శివ--రాజేష్ ఎ.మూర్తి
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్-అర్జున్ త్యాగరాజన్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ

తమిళంలో చాలా పెద్ద స్టార్ అయిన అజిత్ కు తెలుగులో మాత్రం అంతగా మార్కెట్ లేదు. ఇప్పటికే చాలా డబ్బింగ్ సినిమాలతో పలకరించిన అతడికి నిరాశే మిగిలింది. ఇప్పుడతను ‘విశ్వాసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘విశ్వాసం’ అదే పేరుతో ఇక్కడ విడుదలైంది. ఈ చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: పల్లెటూరిలో పుట్టి పెద్దగా చదువుకోకపోయినా.. తాను చేసే మంచి పనుల ద్వారా తమ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో మంచి పేరు సంపాదించిన పెద్దమనిషిగా చెలామణి అవుతుంటాడు వీర్రాజు (అజిత్ కుమార్). తమ గ్రామంలో పదేళ్లకోసారి జరగే జాతరకు కొందరు అడ్డు పడుతుంటే వారికి బుద్ధి చెప్పి జాతర సజావుగా జరిపించేలా చూస్తాడతను. ఐతే ఆ వేడుకల్లో అందరూ సంతోషంగా ఉంటే.. తన భార్యాబిడ్డలు దగ్గర లేక లోలోన మథన పడుతుంటాడు వీర్రాజు. ఇది గమనించి అతడి శ్రేయోభిషిలాషులందరూ వాళ్లిద్దరినీ తిరిగి ఊరికి తీసుకురమ్మని అడుగుతారు. దీంతో తనంటే నచ్చక బిడ్డను తీసుకుని వెళ్లిపోయిన భార్య (నయనతార) కోసం ముంబయికి బయల్దేరతాడు వీర్రాజు. ఇంతకీ వీర్రాజు భార్య అతడిని విడిచి ఎందుకు వెళ్లిపోయింది.. ముంబయి వెళ్లిన అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. తిరిగి ఆమెను తన ఊరికి తీసుకురావడానికి అతనేం చేశాడు.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: అజిత్ అంటే మాస్.. మాస్ అంటే అజిత్.. కొన్నేళ్లుగా ఈ తమిళ స్టార్ సినిమాలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. అతడిలోని మాస్ యాంగిల్ ను పర్ఫెక్టుగా వాడుకుని అభిమానుల్ని అలరించేే సినిమాలు అందించిన దర్శకుడు ‘శౌర్యం’ శివ. అజిత్ తో అతను చేసిన తొలి రెండు సినిమాలు ‘వీరం’.. ‘వేదాళం’ ఊర మాస్ గా సాగుతాయి. ఐతే మూడో ప్రయత్నంలో ఈ ఇద్దరూ కలిసి ‘వివేగం’ అనే కొంచెం వైవిధ్యం ఉన్న సినిమా చేశారు. అది తుస్సుమంది. దీంతో మళ్లీ పాత రూట్లోకి వెళ్లిపోయారు. అదే.. విశ్వాసం. ఇది సగటు మాస్ మసాలా సినిమా. అడుగడుగునా హీరోయిజం.. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎలివేషన్లు.. దీనికి తోడు రొమాన్స్.. కామెడీ.. సెంటిమెంటు.. ఇలా కమర్షియల్ సినిమా మీటర్లో ఉండాల్సిన మసాలాలన్నీ కలిపితే ‘విశ్వాసం’ సినిమా అవుతుంది. కథాకథనాల పరంగా ఏమాత్రం కొత్తగా అనిపించని ఈ సినిమాలో మాస్ మసాలా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు కావాల్సిన అంశాలకైతే ఢోకా లేదు. అంతకుమించి ఆశిస్తే కష్టం.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమా కథకు మసాలా అద్దితే ‘విశ్వాసం’ సినిమా అయిందని చెప్పుకోవచ్చు. ‘డాడీ’ పూర్తిగా సెంటిమెంటు నేపథ్యంలో నడుస్తుంది. అందులో హీరోయిజం తక్కువ. తెలుగులోనే దర్శకుడిగా పరిచయమైన శివ.. బహుశా ‘డాడీ’ స్ఫూర్తితోనే ఈ కథ రాశాడేమో అనిపిస్తుంది. ‘డాడీ’లో హీరో దయాగుణం కారణంగా కూతురు చనిపోయిందని అతడి నుంచి విడిపోతుంది కథానాయిక. ఇక్కడ హీరో గొడవల కారణంగా కూతురి ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని అతడికి దూరమవుతుంది హీరోయిన్. ‘డాడీ’తో పోలిస్తే ‘విశ్వాసం’ పూర్తిగా మాస్ స్టయిల్లో నడుస్తుంది. బోలెడంత హీరోయిజం ఉంటుంది. మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎలివేషన్లు, ఫైట్లతో సినిమా సాగిపోతుంది. అజిత్ లోని మాస్ యాంగిల్ ను శివ మరోసారి పూర్తిగా వాడుకున్నాడు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కూడా బాగానే పని చేసింది.

తొలి సన్నివేశంలో హీరో ఆగమనానికి ముందు.. అతను వచ్చాక ఎవ్వరూ లేచి నిలబడొద్దని.. పంచెలు కిందికి దించొద్దని అనుకుంటుంది విలన్ బ్యాచ్. కానీ హీరో అక్కడికి రాగానే అందరూ లేచి నిలబడతారు. పంచెలు దించుతారు. హీరోను ఎదిరించి మాట్లాడుదామని పైకి లేచి.. అతడి కళ్లలోకి చూడగానే జావగారి పోతాడు విలన్. ఇలా సినిమా ఆరంభమైన దగ్గర్నుంచి ఒకటే ఎలివేషన్లు. హీరో ఏం అనుకుంటే అది చేసేస్తాడు. అతడికసలు ఎదురన్నదే ఉండదు. ఫైట్ల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ వరకు కొంచెం డిఫరెంటుగా.. సరదాగా సాగిపోతుంది. అజిత్-నయన్ ఇద్దరూ బాగా పెర్ఫామ్ చేసి ఆ సన్నివేశాలకు ఆకర్షణ తెచ్చారు. ముంబయి నేపథ్యంలో సాగే ద్వితీయార్ధంలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. రెండో అర్ధంలో సినిమా మరీ సాగతీతగా అనిపిస్తుంది. ఐతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథకు కీలకమైన పాయింట్ రాసుకోవడం బాగుంది. కానీ ఈ నేపథ్యంలో కథను ఒక బిగితో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

‘విశ్వాసం’లో జగపతిబాబు సహా చాలామంది తెలుగు నటీనటులు కనిపించడం వల్ల ఇది కొంత మేర తెలుగు ప్రేక్షకులకు కనెక్టయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. నేటివిటీ ఫ్యాక్టర్ మాత్రం అడుగడుగునా అడ్డు తగులుతుంటుంది. సినిమా ఆద్యంతం తమిళ వాసనలు గుప్పుమంటుంటాయి. ముఖ్యంగా తమిళ నటుల కామెడీ విసుగు తెప్పిస్తుంది. ఒకప్పుడు తెలుగులో మాస్ మసాలా సినిమాల హవా నడుస్తుంటే తమిళంలో కొత్త తరహా సినిమాలొచ్చి ఆదరణ పొందేవి. కానీ ఇప్పుడు తెలుగులో వైవిధ్యమైన సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇలాంటి టైంలో ‘విశ్వాసం’ లాంటి మాస్ మసాలా సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి సినిమా ఇప్పుడొచ్చి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం రుచిస్తుందన్నది సందేహం.

నటీనటులు: అజిత్ కుమార్ కొత్తగా చేసిందేమీ లేదు కానీ.. మాస్ ప్రేక్షకుల్ని అలరించేలా నటించాడు. భార్యాబిడ్డలకు దూరమై సంఘర్షణ అనుభవంచే భర్తగా అతడి నటన ఆకట్టుకుంటుంది. సెంటిమెంట్ సీన్లలో అజిత్ నటన హైలైట్. ముఖ్యంగా క్లైమాక్స్ లో అజిత్ పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. నయనతార మరోసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో ఆమె బాగా చేసింది. కానీ నయన్ కు వేసిన మేకప్పే అంతగా సూటవ్వలేదు. ఆమెలో ఏదో ఒక కృత్రిమత్వం కనిపించింది. విలన్ గా జగపతిబాబు బాగానే చేశాడు. అజిత్ కూతురి పాత్రలో బేబీ అనిఖ ఆకట్టుకుంది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం: డి.ఇమాన్ పాటలేవీ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్టయ్యేలా లేవు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు సాగింది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో అది ఉపయోగపడింది. వెట్రి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. డబ్బింగ్ వర్క్ బాగానే చేశారు. రైటర్ కమ్ డైరెక్టర్ శివ.. తనకు అలవాటైన రీతిలో మాస్ సినిమాను వడ్డించే ప్రయత్నం చేశాడు. ఒక మాస్ కథను ఉన్నంతలో బాగా తీశాడు. కానీ ఎక్కడా కూడా సినిమాలో కొత్తదనపు ఆనవాళ్లు చూపించలేకపోయాడు.

చివరగా: విశ్వాసం.. రొటీన్ మాస్ మసాలా

రేటింగ్-2.5/5