Begin typing your search above and press return to search.

స్నేహం కోసం పధ్ధతి మార్చుకున్న స్టార్

By:  Tupaki Desk   |   15 Feb 2019 6:07 AM GMT
స్నేహం కోసం పధ్ధతి మార్చుకున్న స్టార్
X
మన దగ్గర పెద్దగా మార్కెట్ లేకపోయినా తలా అజిత్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలు అధిక శాతం రీమేక్ కావడంతో పాటు డబ్బింగ్ అయిన కొన్ని కూడా నిర్మాతల ప్లానింగ్ లోపం వల్ల పబ్లిసిటీ లేక జనానికి రీచ్ కావడం లేదు. అందుకే మొన్న సంక్రాంతికి రిలీజైన విశ్వాసం అక్కడ వంద కోట్ల వసూళ్లు తెచ్చినా దాని తెలుగు వెర్షన్ ఇప్పటిదాకా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.

సాధారణంగా అజిత్ ఎక్కడా పబ్లిక్ వేడుకలకు ప్రైవేట్ ఫంక్షన్స్ కు వెళ్ళడు. అవి తన దర్శక నిర్మాతలవైనా సరే ఎంత బ్రతిమాలుకున్నా నో చెప్పేస్తాడు. తన వల్ల ఈవెంట్ కి ఇబ్బంది కలిగి అభిమానుల తాకిడి వల్ల నిర్వాహకులు నష్టపోవడం తనకు ఇష్టం ఉండదు. ఇది అజిత్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు. అయితే మొదటి సారి ఒక ప్రాణ స్నేహితురాలి కోసం తన పద్ధతిని పక్కనే పెట్టేసాడు. తను ఎవరో కాదు దివంగత అతిలోకసుందరి శ్రీదేవి. ఈ నెల ఫిబ్రవరి 24న తన మొదటి వర్ధంతి రాబోతోంది. ఈ సందర్భంగా చెన్నైలోని శ్రీదేవి ఇంట్లో ఓ కార్యక్రమం చేసారు. దానికి అనిల్ కపూర్ తో పాటు సుబ్బరామిరెడ్డి కూడా హాజరయ్యారు.

దీనికి విచ్చేశాడు అజిత్. ఒక్కడే కాదు భార్య షాలిని కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. ఇలా ఓ బయటి కార్యక్రమానికి అజిత్ మొదటి సారి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లిష్ లో అజిత్ చిన్న క్యామియో చేసాడు. ఆ సమయంలోనే భర్త బోనీ కపూర్ సౌత్ లో నిర్మించే సినిమాకు మీరే హీరోగా చేయాలనీ ఆవిడ కోరడం అజిత్ వెంటనే ఓకే చేయడం జరిగిపోయింది. అయితే అనుకోకుండా శ్రీదేవి మరణించడంతో అజిత్ చేసిన ప్రామిస్ మర్చిపోకుండా పింక్ తమిళ్ రీమేక్ లో నటిస్తున్నాడు. శ్రీదేవి అంటే ఎంత గౌరవం ఉందొ అజిత్ మరోసారి ఈ చర్య ద్వారా నిరూపించాడు