Begin typing your search above and press return to search.

మా నాన్నపై కామెంట్లకు బాధపడ్డా-పూరి ఆకాశ్

By:  Tupaki Desk   |   23 Oct 2021 9:49 AM GMT
మా నాన్నపై కామెంట్లకు బాధపడ్డా-పూరి ఆకాశ్
X
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరి జగన్నాథ్.. తన కొడుకు హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. టీనేజీలో ఉండగా ‘ఆంధ్రా పోరి’ అనే సినిమా చేసిన అతను.. ఆ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. తర్వాత అతణ్ని ఫుల్ లెంగ్త్ హీరోగా పరిచయం చేస్తూ పూరి ‘మెహబూబా’ సినిమా తీశాడు. అది కూడా నిరాశపరిచింది. ఇప్పుడు పూరి స్క్రిప్టుతో, ఆయన నిర్మాణంలో తన శిష్యుడు అనిల్ పాడూరి తీసిన ‘రొమాంటిక్’తో ఆకాశ్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రం వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దీని ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో పూరి ఆకాశ్ తండ్రి గురించి మాట్లాడుతున్నపుడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి గొప్పదనాన్ని చెబుతూ.. ఆయన గురించి ఒక టైంలో వచ్చిన కామెంట్లు చూసి తాను బాధ పడ్డట్లు వెల్లడించాడు. ఆకాశ్ ఇంకా ఏమన్నాడంటే..

‘‘నాన్న గురించి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు అవకాశం వచ్చింది. నర్సీపట్నంలో పుట్టి, ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీ అనే మహా సముద్రంలోకి దూకి కష్టపడి పైకి వచ్చాడు మా నాన్న. కుటుంబం, బంధువులు, స్నేహితులందరి బాధ్యతలను భుజాలపై వేసుకుని ఆయన ప్రయాణం ప్రారంభించారు. అంతా బాగుంది అనుకునే సమయంలో ఓ వ్యక్తిని నమ్మడం వల్ల సాఫీగా సాగుతున్న ప్రయాణం అనుకోకుండా ఆగిపోయింది.

అయినా సరే, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన జర్నీని కొనసాగుతున్నారు. ఒక టైంలో ‘పూరి కెరీర్‌ అయిపోయింది’, ‘రొటీన్‌ సినిమాలు చేస్తున్నాడు’.. లాంటి కామెంట్లు చూసి బాధపడ్డాను. అలాంటి కామెంట్లు చేసిన వాళ్లందరికీ ఇప్పుడు ఒక్కటే చెబుతున్నా.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మళ్లీ మా నాన్న హిట్‌ కొట్టాడు. ఆ సినిమా సక్సెస్‌ చూసి నేను కాలర్‌ ఎగరేసుకున్నా’’ అని ఆకాశ్ అన్నాడు. తర్వాత తన తండ్రినుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నాన్నా.. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ ఏదో ఒక రోజు నువ్వు గర్వపడేలా చేస్తా. ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి నటిస్తా. ఎన్ని సంవత్సరాలైనా సరే.. నేను కష్టపడి నువ్వు కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తా’’ అని ఆకాశ్‌ స్టేట్మెంట్ ఇవ్వగా.. పూరి సైతం ఆ టైంలో కొంచెం ఎమోషనల్ అయిపోవడం గమనార్హం.