Begin typing your search above and press return to search.

ఆకాశ్ తండ్రి పూరి అని చెప్పుకునే రోజు వస్తుంది!

By:  Tupaki Desk   |   23 Jun 2022 3:32 AM GMT
ఆకాశ్ తండ్రి పూరి అని చెప్పుకునే రోజు వస్తుంది!
X
ఆకాశ్ పూరి - గెహనా సిప్పీ కాంబినేషన్లో జీవన్ రెడ్డి రూపొందించిన 'చోర్ బజార్' సినిమా ఈ నెల 24వ తేదీన విడుదలవుతోంది. 'నిరీక్షణ' సినిమాతో చాలా కాలం క్రితమే కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'అర్చన'.. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో నటించారు. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్చన మాట్లాడుతూ.. "గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుందిగానీ, ఏదో ఒక భాషలో ఎక్కడో ఒక చోట చేస్తూనే ఉంటాను. తెలుగు నుంచి కూడా కథలను వింటూనే ఉన్నాను.

ఒక రోజున జీవన్ రెడ్డిగారి నాకు కాల్ చేశారు. 'తాను 'చోర్ బజార్' అనే సినిమాను చేస్తున్నట్టుగా చెప్పారు. నేను నా వయసును దృష్టిలో పెట్టుకుని ఎవరికీ అమ్మగా చేయాలి? ఎవరికీ అక్కగా.. వదినగా చేయాలి? అని అడిగాను.

మీరు ఎవరికీ ఏమీకారు.. ఎప్పటిలానే ఒక ఇండిపెండెంట్ పాత్ర అని చెప్పారు. ఇంకా ఏం చేయాలని అడిగితే, మీరు అమితాబ్ ను లవ్ చేయాలని అన్నారు. 25 సంవత్సరాల తరువాత మళ్లీ నేను 'ఏ డేట్స్ కావాలి?' అని అడిగాను. నిజం చెప్పాలంటే ఇంత కలర్ ఫుల్ సినిమా నేను ఇంతవరకూ చేయలేదు.

ఆకాశ్ పూరి ఈ సినిమా హీరోగా నాకు పరిచయమయ్యాడు.. ఇప్పుడు తను నా కొడుకులాంటివాడు. ఆకాశ్ కి ఒక హీరోకి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. తను చాలా మంచి హైటూ.. సినిమా అంటే చాలా ఫ్యాషన్ ఉంది.. డిసిప్లిన్ ఉంది. ఈ సినిమా తరువాత ఆకాశ్ తండ్రి పూరి అని చెప్పుకుంటారు.. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నాను. సురేశ్ బొబ్బిలి కొత్త ప్రయోగం చేశాడని అనుకుంటున్నాను.

జీవన్ రెడ్డి గారు చాలా కంఫర్టును ఇచ్చారు. ఆయన చాలా కమిటెడ్ డైరెక్టర్. అలాంటి ఆయన ఒక కలర్ఫుల్ సినిమా చేయడమనేది చాలా మంచి విషయం. అలాంటి జీవన్.. 25 సంవత్సరాల తరువాత నన్ను గుర్తుపెట్టుకుని ఈ సినిమా కోసం పిలిపించారు.

నన్ను ఒక అక్కలా చూసుకున్నారు. ఈ సినిమా మొదలుపెట్టిన తరువాత సెకండ్ లాక్ డౌన్ వచ్చింది. ఆ పరిస్థితిని దాటుకుని ఈ సినిమాను ఇక్కడికి తీసుకు రావడం నిర్మాత గొప్పతనమేనని చెప్పచ్చు" అంటూ ముగించారు.