Begin typing your search above and press return to search.

నేను హిట్టు కొట్టాలా .. నువ్వు కాలర్ ఎగరేయాలా: ఆకాశ్ పూరి

By:  Tupaki Desk   |   23 Oct 2021 3:14 AM GMT
నేను హిట్టు కొట్టాలా .. నువ్వు కాలర్ ఎగరేయాలా: ఆకాశ్ పూరి
X
'రొమాంటిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి వరంగల్ లో జరిగింది .. ఈ వేదికపై ఆకాశ్ పూరి తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. "నేను మా నాన్న గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మా నాన్న ఇండస్ట్రీకి వచ్చాడు .. ఎంతో కష్టపడ్డాడు అంటూ ఒక చిన్న కథలాంటిది చెప్పాడు. " మా నాన్న ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఒక బస్సు కొన్నాడు. అందులో మా అమ్మను .. నన్ను .. మా చెల్లిని ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్ కి బయల్దేరాడు.

ఒక రాంగ్ పర్సన్ ను నమ్మడం వలన, ఆ బస్సు మధ్యలో ఆగిపోయింది. మేమంతా ఆ బస్సులోనే కూర్చుని ఉన్నాము. కానీ మా నాన్న ఒక్కడే బస్సు దిగి దానిని తోయడం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా ఆ బస్సును అలా తోస్తూనే వచ్చాడు. మా నాన్నని ఎవరైనా ఏమైనా అంటే, వాడిని ఇంటికి వెళ్లి వాడి తల పగలగొడదామని అనిపించేది నాకు. 'వీడి పనైపోయింది .. ఇంకేం తీస్తాడు .. సేమ్ అవే సినిమాలు' అని చెప్పుకునేవారు. కానీ ఆయన 'ఇస్మార్ట్ శంకర్' తో ఇచ్చిన హిట్ అలాంటిది ఇలాంటిది కాదు.

ఇప్పుడు చెబుతున్నాను .. నీ కెరియర్ అయిపోయింది .. నీ వల్ల ఏం కాదు .. అనేసిన ప్రతి వాళ్లకి నేను చెబుతున్నాను. దీనబ్బా కొట్టాడ్రా మా వోడు' అనుకునేలా చేస్తాను. థియేటర్లో మా నాన్న డైలాగ్స్ కి జనాలు ఎగురుతుంటే నేను కాలర్ ఎగరేసేవాడిని. నాకు ఆ మూమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. తండ్రిని ఉద్దేశించి .. "నాన్న నువ్వు నాకు ఒక మాట చెప్పావు .. 'ఒరేయ్ జీవితంలో సక్సెస్ కావడం .. ఫెయిల్ కావడం ముఖ్యం కాదు. మనకి ఇష్టమైన పనిలో మనం ఉంటే చాలు, అదే సక్సెస్' అన్నావు. జీవితంలో కొన్నాళ్ల వరకూ నేను ఆ మాటను నమ్మను.

కానీ ఆ మాట నాకు కరెక్టు కాదు నాన్న .. నేను ఆ రూట్లో ఉండకూడదు. ఎందుకంటే మీ నాన్నపేరు ఇక్కడ ఎవరికీ తెలియదు .. కానీ మా నాన్న పేరు ఇక్కడ ఉన్న వాళ్లందరికీ తెలుసు. ఒక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేనివాడు ఇండస్ట్రీకి వచ్చి, వాడు ఫెయిలైతే ఫరవాలేదు .. పాపం అని జాలి చూపిస్తారు. కానీ ఒక బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడు ఇండస్ట్రీకి వచ్చి వాడు ఫెయిలైతే, బయట వాడిని మనిషిలా కూడా చూడరు నాన్న. సో నా లైఫ్ లో నేను సక్సెస్ అవ్వడమే రియల్ సక్సెస్. నేను అవుతాను నాన్న .. సక్సెస్ అవుతాను .. అందుకోసం ఎంత కష్టమైనా పడతాను.

నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం నాన్న .. నేను హీరోగా చేస్తుంటే నన్ను కామెంట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. కానీ నువ్వు గర్వపడేలా చేస్తాను. 'ప్రతి సినిమా నీ ఫస్టు సినిమా అనుకుని చేయి' అన్నావు .. కానీ నాన్న ప్రతి సినిమా నా లాస్టు సినిమా అనుకుని చేస్తాను. ప్రతి షాట్ ప్రాణం పెట్టి చేస్తాను. నాన్న నిన్ను చూసి నేను కలర్ ఎగరేసినట్టుగా నన్ను చూసి నువ్వు కూడా కాలర్ ఎగరేయాలి. నిజంగా నాకు ఎప్పుడు బ్రేక్ వస్తుందో నాకు తెలియదు. 'టెంపర్' సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా నాన్న .. 'నువ్వు కొట్టాలా నేను పెట్టాలా' అని. అలా నేను ఇక్కడ హిట్టు కొట్టాలా .. నువ్వు కాలర్ ఎగరేయాలా. సినిమా హిట్ అయినా సినిమాలు చేస్తూనే ఉంటాను .. ఫ్లాప్ అయినా సినిమాలు చేస్తూనే ఉంటాను. ఇది తప్ప నాకు ఏదీ రాదు. నాకు తెలిసిందల్లా సినిమా .. సినిమా .. అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.