Begin typing your search above and press return to search.

దీపావళికి పూరీ తనయుడి 'రొమాంటిక్'..!

By:  Tupaki Desk   |   25 Sep 2021 8:32 AM GMT
దీపావళికి పూరీ తనయుడి రొమాంటిక్..!
X
డాషింగ్ డైరెక్టర్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 'మెహబూబా' సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఆకాష్.. ఇప్పుడు ''రొమాంటిక్'' సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. పూరీ ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే పూర్తైన ఈ సినిమాని కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రొమాంటిక్ పోస్టర్ ద్వారా 'రొమాంటిక్' మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో గ్లామరస్ కేతిక శర్మను ఆకాష్ ఫాలో అవుతూ కనిపిస్తున్నాడు. ఇందులో ఆకాష్ - కేతిక జంట మనోహరంగా ఉంది.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ - రెండు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ వారు ఎలాంటి కట్స్ సూచించకుండా.. ఈ చిత్రానికి 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. భాస్కరభట్ల పాటలు రాశారు. నరేష్ సినిమాటోగ్రఫీ అందించగా.. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. జునైద్ సిద్దిఖీ దీనికి ఎడిటర్. 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ నిర్మిస్తున్న సినిమా ఇది. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై 'రొమాంటిక్' సినిమా రూపొందుతోంది.

ఇకపోతే దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4న మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'గని' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'అన్నాత్తే' వంటి డబ్బింగ్ చిత్రాన్ని కూడా అప్పుడే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పూరీ తనయుడి ''రొమాంటిక్'' సినిమా కూడా దీపావళి రేసులోకి వచ్చి చేరింది.