Begin typing your search above and press return to search.

'అఖండ'కి మాత్రమే అది సాధ్యమైంది!

By:  Tupaki Desk   |   12 Jan 2022 8:41 AM GMT
అఖండకి మాత్రమే అది సాధ్యమైంది!
X
బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. గతంలో సంక్రాంతి బరిలోకి దిగిన చాలా సినిమాలు ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఈ సారి సంక్రాంతికి గట్టిపోటీ ఉంటుందనే ఉద్దేశంతో 'అఖండ'ను కాస్త ముందుగానే విడుదల చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సారి సంక్రాంతి బరిలో ఉంటాయన్న సినిమాలు పక్కకి తప్పుకోవడం కూడా 'అఖండ'కు కలిసొచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ 'అఖండ' సంక్రాంతి సంబరాలు పేరుతో మళ్లీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది.

'సంక్రాంతి సంబరాలు' వేడుకకి బాలకృష్ణ .. శ్రీకాంత్ తో పాటు దర్శక నిర్మాతలు వచ్చారు. వేదికపై ఈ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. "నిన్ననే ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు. బాలకృష్ణ సినిమా అంటేనే సంక్రాంతికి వస్తుంది. "ఈ సినిమా మా థియేటర్లో ఇంకో నాలుగైదు రోజులు ఉంటే 50 రోజులు అవుతుంది .. ఉంచండి సార్" అని అన్నాడు. డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వరకూ కొన్ని వందల థియేటర్లలో రన్ అవుతుండటం విశేషం. ఈ మధ్య కాలంలో ఇన్ని రోజులు థియేటర్లలలో ఉన్న సినిమా ఇది ఒక్కటేనని అనుకుంటున్నాను. అందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది.

నా సినిమా జర్నీ 2015లో మొదలైంది .. నిర్మాతగా ఇది నాకు మూడో సినిమా. 'సాహసం శ్వాసగా సాగిపో' .. 'జయ జానకి నాయక' తరువాత నేను 'అఖండ' చేశాను. మొదటి రెండు సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు అంత సంతృప్తికరంగా లేరు .. ఆ గిల్ట్ ఫీలింగ్ నాలో ఉండేది. కానీ వాళ్లంతా కూడా వాళ్ల ఇబ్బందిని గురించి నాకు చెప్పకుండా, నన్ను ఓదార్చుతున్నట్టుగా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్లందరికీ కూడా లాభాలు తెచ్చిపెట్టే సినిమాలు చేయాలని నేను అనుకునేవాడిని .. అది 'అఖండ'తో తీరింది.

నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఈ సినిమా ఇలా మీ ముందుకు రావడానికి సహకరించిన టీమ్ కి .. ఈ స్థాయిలో ఆదరించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ కి ముందు కరోనా కారణంగా ఇండస్ట్రీ పరిస్థితి ఏమంత బాగుండేది కాదు. థియేటర్లకు పెద్ద సినిమాలు రావడం ఇక కలేనా? .. మళ్లీ థియేటర్లు కళకళలాడుతూ ఉండటం చూస్తామా? అనుకుంటున్న సమయంలో 'అఖండ' వచ్చింది. మేమంతా కూడా ధైర్యం చేసి ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చాము.

బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రేక్షకులు లెక్క చేయకుండా థియేటర్ కి వచ్చి ఈ సినిమాను ఆదరించారు. ప్రేక్షకులు ఎప్పుడూ కూడా థియేటర్లో సినిమా చూడటానికే ప్రాధాన్యతనిస్తారు అనే విషయాన్ని నిరూపించారు. ఈ సినిమా బిజినెస్ లో భాగమైనవాళ్లు .. సినిమా చూసినవాళ్లు అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక ముందు కూడా మీ ఆదరణ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించాడు.