Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ: అఖిల్

By:  Tupaki Desk   |   11 Nov 2015 6:48 AM GMT
సినిమా రివ్యూ: అఖిల్
X
చిత్రం - అఖిల్

నటీనటులు- అఖిల్ - సాయేషా సైగల్ - రాజేంద్ర ప్రసాద్ - బ్రహ్మానందం - మహేష్ మంజ్రేకర్ - వెన్నెల కిషోర్ - జయప్రకాష్ రెడ్డి - సప్తగిరి - మధునందన్ తదితరులు
సంగీతం- అనూప్ రూబెన్స్ - థమన్
నేపథ్య సంగీతం- మణిశర్మ
ఛాయాగ్రహణం- అమోల్ రాథోడ్
కథ- వెలిగొండ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే - మాటలు- కోన వెంకట్
నిర్మాత- నితిన్
దర్శకత్వం- వి.వి.వినాయక్

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ‘అఖిల్’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అక్కినేని నవతరం కథానాయకుడు అఖిల్ వెండితెరపైకి దూసుకొచ్చేశాడు. మరి ‘అఖిల్’ ఎలా ఉంది? అఖిల్ ఎలా ఉన్నాడు? చూద్దాం పదండి.

కథ:

అఖిల్ (అఖిల్) ఓ అనాథ కుర్రాడు. డబ్బుల కోసం ఫైట్లు చేస్తూ, ఫ్రెండ్స్ తో జాలీగా గడిపేస్తూ సాగిపోతున్న అతను మెడికల్ స్టూడెంట్ అయిన దివ్య (సాయేషా)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తనో డాక్టర్ అని అబద్ధమాడి తనతో స్నేహం చేస్తాడు. ఆమె పెళ్లి చెడగొట్టి తనకు చేరువవుతాడు. ఇంతలో దివ్యను బోడో అనే ఆఫ్రికా రౌడీ ఎత్తుకెళ్తాడు. తన కోసం అఖిల్ ఆఫ్రికాకు బయల్దేరతాడు. ఇంతకీ దివ్యను బోడో ఎందుకు ఎత్తుకెళ్తాడు? తనకు తెలిసిన రహస్యమేంటి? ఆమెను కాపాడ్డానికి అఖిల్ ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

సాధారణంగా ఓ కొత్త కథానాయకుడి అరంగేట్రం అంటే.. రొటీన్ కథల్నే ఎంచుకుంటారు. సేఫ్ గేమ్ ఆడటానికే ప్రయత్నిస్తారు. ఐతే అఖిల్ విషయంలో మాత్రం వినాయక్ భిన్నమైన దారిని ఎంచుకున్నాడు. కొంచెం కాంప్లికేటెడ్ కథనే ఎంచుకున్నాడు. ప్రపంచాన్ని ఘోర విపత్తు నుంచి కాపాడే సూపర్ హీరోగా అఖిల్ ను చూపించే ప్రయత్నం చేశాడు. ఓ డిఫరెంట్ కథకు తనదైన శైలిలో కమర్షియల్ హంగులు అద్ది ఓ అరంగేట్ర హీరోను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించే ప్రయత్నం చేశాడు.

తెలుగులో ఈ తరహా కథలతో ఇంతకుముందు వచ్చిన సినిమాలు సరైన ఫలితాన్నివ్వలేదు. ఇలాంటి కథలను ‘కమర్షియల్’గా వర్కవుట్ చేయడం కత్తి మీద సామే. ఐతే వినాయక్ తన అనుభవాన్నుపయోగించి ఈ కథకు కమర్షియల్ అంశాలతో కలిపి చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే అదనపు ఆకర్షణలన్నీ బాగున్నాయి కానీ.. కథ పరంగా ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేదని, మూల కథను హీరోకు రిలేట్ చేసే విషయంలో ఎమోషన్ ఇంకా బాగా పండాల్సిందని ప్రేక్షకుడు ఆశిస్తే తప్పేం లేదు.

ఆరంభంలో ‘జువా’ నేపథ్యాన్ని వివరించే సన్నివేశాలు ఆసక్తి రేపుతాయి. ఆ తర్వాత హీరో అరంగేట్రం దగ్గర వినాయక్ లోని మాస్ డైరెక్టర్ నిద్ర లేచి అక్కినేని ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించాడు. ఇంట్రడక్షన్ ఫైట్, పాట అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ.. కొన్ని ఫన్నీ సీన్స్ తో కథనం ముందుకు సాగుతుంది. రాజేంద్ర ప్రసాద్, అఖిల్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కొంత వినోదాన్ని పండిస్తాయి. ఐతే సెంటిమెంట్ కోసం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలితాన్నివ్వలేదు.

స్పెయిన్ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ మొదట కొంత బోర్ కొట్టించినా ఇంటర్వెల్ కు ముందు వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. అందులో అఖిల్ కళ్లు చెదిరే విన్యాసాలు చేశాడు. వినాయక్ మార్కు భారీతనం ఈ సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రథమార్ధం ఓకే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో బ్రహ్మానందం పాత్ర ప్రవేశంతో కథనానికి ఊపొస్తుంది. బ్రహ్మి పాత్ర ముందు మామూలుగా అనిపిస్తుంది కానీ.. పోను పోను పంచ్ లతో ఆకట్టుకుంటుంది.

అఖిల్ - బ్రహ్మి - వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే ‘ఫాదర్’ కామెడీ... ముగ్గురి మధ్య వచ్చే డైలాగులు నవ్విస్తాయి. వీళ్ల ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలే ద్వితీయార్ధాన్ని నడిపించాయి. ఐతే ‘జువా’కు సంబంధించిన ఎపిసోడే అంచనాలకు తగ్గట్లు లేదు. సూర్య కవచాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టే బాధ్యతను హీరో తీసుకోవడానికి దారి తీసే సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా ఉండాల్సింది. అక్కడ ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ చేయాల్సింది. కిల్లర్ ఫిష్ ల నుంచి తప్పించుకుని ‘జువా’ను హీరో తీసుకొచ్చే సన్నివేశం బావుంది.

ఐతే చివర్లో వచ్చే ఫ్లయిట్ సీక్వెన్స్ మాత్రం ఆకట్టుకోదు. దీన్ని హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. అడవి జంతువుతో ఫైటింగ్ కూడా అలాగే ఉంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్టుల గురించి ‘అఖిల్’ టీమ్ చెప్పిన స్థాయిలో ఔట్ పుట్ లేదు. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలే ఉండటం ‘అఖిల్’కు పెద్ద ప్లస్ పాయింట్. దీని వల్ల ఎక్కడా లాగ్ వచ్చిన ఫీలింగ్ కలగదు. ఐతే నిడివి తగ్గించే ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రథమార్ధంలో ఇంకాస్త వినోదం పండి ఉంటే.. పతాక సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా ఉండుంటే.. ‘అఖిల్’ మరింత మెరుగ్గా అనిపించేది.

నటీనటులు:

ఓ కొత్త హీరో అరంగేట్రం చేస్తున్నాడంటే కథాకథనాల కంటే కూడా ఆ హీరో పెర్ఫామెన్స్ ఎలా ఉందని చూస్తారు. ఈ విషయంలో అఖిల్ నిరాశ పరచలేదు. డ్యాన్సులు - ఫైట్ల - ఎనర్జీ విషయంలో అఖిల్ కు తిరుగులేదు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్ లో అఖిల్ డ్యాన్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. టాలీవుడ్ లోకి మరో డ్యాన్సింగ్ సెన్సేషన్ వచ్చాడని కచ్చితంగా చెప్పొచ్చు. అక్కినేని పాటలోనూ అఖిల్ అదరగొట్టాడు. డ్యూయెట్లలో కూడా మంచి స్టెప్పులేశాడు. యాక్షన్ ఎపిసోడ్లలో కూడా అఖిల్ ఎనర్జీ, అతడి చురుకుదనం ఆకట్టుకుంటుంది. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఐతే ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనే మెరుగవ్వాల్సి ఉంది. హీరోయిన్ సాయేషా సైగల్ కూడా మంచి డ్యాన్సరే. కానీ హీరోయిన్ కు ఉండాల్సిన ఫీచర్స్ ఆమెలో తక్కువే. నటన కూడా ఏమంత బాలేదు. రాజేంద్ర ప్రసాద్ ఉన్నంతవరకు బాగా చేశాడు. కానీ ఆయన పాత్రను మధ్యలోనే అలా వదిలేశారు. బ్రహ్మానందం - వెన్నెల కిషోర్ తమదైన శైలిలో నవ్వించారు. సప్తగిరి మెప్పించలేకపోయాడు. మహేష్ మంజ్రేకర్ కు సరైన క్యారెక్టర్ పడలేదు. విలన్ పాత్ర కూడా పేలవంగా ఉంది. ఐతే బోడోగా చేసిన విలన్ ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ టీమ్ మంచి ఔట్ పుట్ ఇచ్చింది. అనూప్ రూబెన్స్, తమన్ (ఒక్క పాటే) కలిసి హుషారెత్తించే పాటలిచ్చారు. మెలోడీలకు పెట్టింది పేరైన అనూప్.. అఖిల్ డ్యాన్సుల కోసం మాంచి బీట్ ఉన్న పాటలే చేశాడు. మణిశర్మ నేపథ్య సంగీతం ఆయన శైలికి కొంచెం భిన్నంగా, ఇప్పటి ట్రెండుకు తగ్గట్లు సాగింది. మణి ముద్ర కనిపించలేదు. హీరోకు ఓ సిగ్నేచర్ ట్యూన్ చేసి.. హీరోయిజం ఎలివేట్ అయినపుడల్లా దాన్ని ప్లే చేయడం మణికి అలవాటు. ‘అఖిల్’లో అది మిస్సయింది. అమోల్ రాథోడ్ కెమెరా పనితనం బాగుంది. ఫారిన్ లొకేషన్లను అందంగా చూపించాడు. పాటల చిత్రీకరణ బాగుంది. వినాయక్ మార్కు భారీతనాన్ని అతడి కెమెరా బాగానే చూపించింది.

నిర్మాణ విలువలకు ఏమాత్రం ఢోకా లేదు. ఒక్కో పాటకు రెండు మూడు సెట్లు.. భారీ ఫారిన్ లొకేషన్లు.. హంగామా చాలానే కనిపించింది. ఐతే సినిమా వాయిదా పడటానికి గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ మరీ అంత గొప్పగా ఏమీ లేవు. కోన వెంకట్ మాటలు బ్రహ్మానందంతో ముడిపడ్డ సన్నివేశాల్లో బాగా పేలాయి. అందులో ‘ఫాదర్’ డైలాగ్ హైలైట్. ఇక దర్శకుడు వినాయక్.. అఖిల్ ను మాస్ హీరోగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సన్నివేశాల టేకింగ్, ద్వితీయార్ధంలో కామెడీ వరకు తన ముద్ర చూపించాడు. కథాకథనాల్ని మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుకోవాల్సింది. ఆయన్నుంచి మరింత మంచి ఔట్ పుట్ ఆశిస్తాం.

చివరగా: అక్కినేని కుర్రాడు పాసయ్యాడు


రేటింగ్- 3​/5

#Akhil, #Akhilmovie, #AkhilReview, #AKhilTalk, #AkhilRating, #AkhilMoviereview