Begin typing your search above and press return to search.

అఖిల్.. పంచ్ గట్టిగానే ఇచ్చాడు

By:  Tupaki Desk   |   2 Nov 2015 5:30 PM GMT
అఖిల్.. పంచ్ గట్టిగానే ఇచ్చాడు
X
సినిమా వాయిదా వేయడానికి కారణం కేవలం గ్రాఫిక్ వర్క్ మాత్రమే.. అది కొన్ని రోజుల్లో అయిపోతుంది.. సినిమాకు సంబంధించి ఇంకే ఇబ్బందులూ లేవు.. అని నొక్కి వక్కాణించాడు నాగార్జున. ఆ తర్వాత అఖిల్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అంతా సవ్యంగా సాగిపోతోందని. కానీ జనాలు ఊరుకుంటారా? ఓ వర్గం ఉద్దేశపూర్వకంగా ‘అఖిల్’ ఔట్ పుట్ బాగా రాలేదని, రీషూట్లు చేస్తున్నారని, రిపేర్లు జరుగుతున్నాయని పనిగట్టుకుని ప్రచారం చేసింది.

కొన్ని వెబ్ సైట్లు కూడా అదే పనిగా రీషూట్ల గురించి వార్తలు రాశాయి. అఖిల్ ఈ ఏడాది అసలు విడుదలే కాదని.. వచ్చే సంక్రాంతికి, లేదా ఆ తర్వాత విడుదల చేస్తారని పనిగట్టుకుని ప్రచారం చేశాయి. హీరోగా తొలి సినిమాకే అఖిల్ ప్రకంపనలు, రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతుంటడం చూసి.. జెలసీతో కొందరు కావాలనే ఈ ప్రచారం చేసినట్లు అక్కినేని అభిమానుల్లో అనుమానాలున్నాయి.

ఐతే అన్ని అనుమానాలకు తెరదించేస్తూ.. అసత్య ప్రచారానికి చెక్ పెడుతూ దీపావళికి కన్ఫమ్ అయిపోయింది ‘అఖిల్’ సినిమా. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. నిజానికి అక్కినేని ఫ్యాన్స్ అంత అగ్రెసివ్ గా ఉండరు. ఏఎన్నార్ - నాగార్జన - నాగచైతన్యల విషయంలో వాళ్లు చాలా కూల్ గానే ఉండేవాళ్లు. కానీ అఖిల్ విషయంలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్ రూటు మార్చారు. మొదట్నుంచి చాలా అగ్రెసివ్ గా ఉంటున్నారు.

అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ అతి పెద్ద మాస్ హీరో అవుతాడన్న అంచనాలతో అతడికి ముందు నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఐతే అఖిల్ సినిమా వాయిదా పడటంతో వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ‘అఖిల్’ గురించి దుష్ప్రచారం జరుగుతుంటే తట్టుకోలేక బాధపడ్డారు. ఐతే దీపావళికే సినిమా కన్ఫమ్ అయిపోవడంతో వారి ఆనందం మామూలుగా లేదు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం ద్వారా యాంటీస్ కి పంచ్ గట్టిగానే ఇచ్చారని సంబరపడిపోతున్నారు.