Begin typing your search above and press return to search.

అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఆ ఇద్దరు మార్కాపురం కోర్టుకు

By:  Tupaki Desk   |   17 Dec 2021 4:33 AM GMT
అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఆ ఇద్దరు మార్కాపురం కోర్టుకు
X
వివాదాలకు దూరంగా ఉండే అలవాటున్న అక్కినేని కుటుంబం ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుందా? అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు సినిమాకు రెండు కళ్లుగా వ్యవహరించిన ఎన్టీఆర్.. అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. డబ్బులకు సంబంధించి విషయాల్లో వారిని వేలెత్తి చూపించే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదంటారు. అలాంటి ఇమేజ్ ఉన్న అక్కినేని కుటుంబానికి తాజాగా ఒక చెక్ బౌన్స్ కేసు ఇప్పుడు వారిని వెంటాడుతోంది. అక్కినేని నాగేశ్వరరావు మనమడు కమ్ టాలీవుడ్ హీరో సుమంత్.. ఒకప్పుడు నటిగా ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న సుప్రియలు తాజాగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

వారిద్దరు తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టుకు రావాల్సి వచ్చింది. నరుడా డోనరుడా సినిమాకు సంబంధించి తనకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యిందంటూ మార్కాపురం కోర్టులో ఫైనాన్సియర్ కారుమంచి శ్రీనివాసరావు కేసు వేశారు. ఈ సినమాకు హీరోగా సుమంత్.. నిర్మాతగా సుప్రియ ఉన్నారు. ఈ సినిమాకు కొంత మొత్తాన్ని కారుమంచి ఫైనాన్స్ చేశారు.

ఈ వ్యవహారంలో తనను వారిద్దరూ మోసం చేశారంటూ కారుమంచి ఆరోపిస్తూ.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కోసం కోర్టు ఎదుట హాజరయ్యేందుకు సుమంత న్యాయస్థానానికి వచ్చారు. ఈ కేసు వాయిదా కోసం కోర్టుకు వచ్చిన ఈ ఇద్దరిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కోర్టు వద్దకు వచ్చారు.

దీంతో.. అక్కడి వాతావరణం రోటీన్ కు భిన్నమైన సందడి చోటు చేసుకుంది. ఆర్థిక క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే.. అక్కినేని తీరుకు ఆయన కుటుంబ సభ్యులు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న మాట తాజాగా వినిపిస్తోంది. మరి.. ఈ వివాదాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ఏ రీతిలో సెటిల్ చేసుకుంటారో చూడాలి.