Begin typing your search above and press return to search.

ఓటీటీ గూటికే అక్కినేని హీరో సినిమా!

By:  Tupaki Desk   |   21 Jan 2022 7:30 AM GMT
ఓటీటీ గూటికే అక్కినేని హీరో సినిమా!
X
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తరువాత వచ్చిన హీరో సుమంత్. ఫిజిక్ పరంగా .. యాక్టింగ్ పరంగా సుమంత్ కి వంకబెట్టవలసిన అవసరం లేదు. అయితే ఎందుకో ఆయనకి పెద్దగా హిట్లు పడలేదు. 'సత్యం' .. 'గోదావరి' వంటి సినిమాలు తప్ప ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలు కనిపించవు. ఇక సుమంత్ కూడా వరుస సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపించడు. చకచకా సినిమాలు చేయాలనే ఆత్రుత ఆయనలో కనబడదు.

అక్కినేని ఫ్యామిలీలోని మిగతా హీరోల సినిమాల్లోను కనిపించడానికి పెద్దగా ఆసక్తిని చూపనట్టు తెలిసిపోతూనే ఉంటుంది. ఈ సినిమా మీరు చేయాలి అని చెప్పేసి వెళితే చేస్తాడు .. లేదంటే లేదు. ఇక ఇతర సినిమాల సినిమాల ఫంక్షన్స్ లో ఆయన కనిపించడు. అలాగే తన సినిమాలను గురించి కూడా ఎక్కడా ఎక్కువగా మాట్లాడడు. సైలెంట్ గా ఆయన తన పని తాను చేసుకుపోతుంటాడు అంతే. ఈ మధ్య కాలంలో కూడా ఆయనకి హిట్ ఇచ్చిన సినిమాలేవీ లైన్ మీద కనిపించవు.

కొంతకాలం క్రితం ఆయన 'మళ్లీ మొదలైంది' అనే ఒక సినిమా చేశాడు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తుందేమోనని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తోంది. జీ 5 వారు ఈ సినిమా స్క్రీనింగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నారు.

విడాకులు తీసుకున్న కథానాయకుడు .. ఆ కేసును వాదించే న్యాయవాదితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో సుమంత్ సరసన నాయికలుగా నైనా గంగూలీ .. వర్షిణి సౌందరరాజన్ కనిపించనున్నారు. ఒక కీలకమైన పాత్రలో సుహాసిని నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో పోసాని, పృథ్వీ .. మంజుల ఘట్టమనేని .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. మరి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.