Begin typing your search above and press return to search.

ద‌స‌రాబుల్లోడు గుండెల్లో ఒదిగాడు

By:  Tupaki Desk   |   20 Sep 2018 3:52 AM GMT
ద‌స‌రాబుల్లోడు గుండెల్లో ఒదిగాడు
X
ఇద్ద‌రు క‌థానాయిక‌ల ముద్దుల హీరో అక్కినేని వారు. అక్కినేని అంద‌గాడు అని ఆయ‌న‌కు ఊర‌క‌నే పేరు రాలేదు. ద‌స‌రా బుల్లోడు అని తెలుగువారు గుండెల్లో దాచుకున్నారంటే దానివెన‌క చాలానే క‌థ ఉంది. గొప్ప ప్ర‌తిభ‌ - సాహ‌సం - అంత‌కుమించి వ్య‌క్తిత్వంలో ఉదాత్త‌త‌ - గొప్ప ధీరోధాత్త‌త దాగి ఉన్నాయి. మ‌ద్రాసు రైలు ఎక్కేట‌ప్పుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ను ఘంట‌సాల తాత‌గారు బ‌ల‌రామ‌య్య చూడ‌క‌పోయి ఉంటే - అస‌లు ఆయ‌న రైలు ప‌య‌నం ఎటెల్లేదో. స్టేజీల‌పై అమ్మాయి గెట‌ప్పుల‌తో నాట‌కాలాడుకునే ఆయ‌న ఉన్న‌ట్టుండి సినిమా కోసం ముఖానికి రంగేసుకోవ‌డం మొద‌లైంది బ‌ల‌రామ‌య్య ప్రోత్సాహం - అండ‌దండ‌ల‌తోనే. 1941లో ధ‌ర్మ‌ప‌త్రి అనే చిత్రంతో అక్కినేని తెరంగేట్రం జ‌రిగింది. పి.పుల్ల‌య్య‌ - చ‌క్ర‌పాణి (ద‌ర్శ‌క‌నిర్మాత‌) వంటి దిగ్గ‌జాల ప‌రిచ‌యం అక్కినేనికి బ‌ల‌రామ‌య్య వ‌ల్ల‌నేన‌ని చెబుతారు. ఆ సినిమా చేసేప్ప‌టికి 17 ఏళ్ల వ‌య‌సు. అందులో బాల‌కుడిగానే తెరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత మూడేళ్ల గ్యాప్‌. 1944లో సీతారామ జ‌న‌నం చిత్రంలో న‌టించారు. అదే ఏడాది వేరొక ఆఫ‌ర్‌. కెరీర్‌ తొమ్మిదేళ్ల‌కు `కీలుగుర్రం` అనే మూకీ సినిమాలో నూనూగు మీసాల కుర్రాడిగా క‌నిపించారు.

స‌మ‌కాలీన న‌టుడు ఎన్టీఆర్‌ తో పోటీప‌డుతూ అక్కినేని కెరీర్‌ని మ‌లుచుకున్న తీరు న‌భూతోన‌భ‌విష్య‌తి. ఓవైపు ఎన్టీఆర్ గొప్ప అంద‌గాడుగా పేరు తెచ్చుకుని వెలుగుతుంటే మ‌రోవైపు ఏఎన్నార్ సాటి హీరోల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా స్టైలిష్ మ్యాన‌రిజం - యాటిట్యూడ్‌ తో - గొప్ప వ్య‌క్తిత్వంతో అంద‌రిలో పేరు తెచ్చుకున్నారు. త‌న‌ని తాను అంద‌గాడుగా అంద‌రూ పొగిడేసేంత‌గా త‌న‌ని మ‌లుచుకున్నారు. క‌థానాయిక‌లు ఏఎన్నార్ అంటే గొప్ప‌గా ఇదైపోయేవారు. ద‌స‌రా బుల్లోడుగా చెర‌గ‌ని ముద్ర వేశారు. కెరీర్‌ లో దాదాపు 244 చిత్రాల్లో న‌టించారు. మ‌నం సినిమా టైమ్‌ లోనే త‌న‌కు క్యాన్స‌ర్ ఉంద‌ని ప్రెస్‌ మీట్ పెట్టి మ‌రీ చెప్పారు.

అంతేకాదు.. అలా చెబుతున్న వేళ అత‌డిలో కించిత్ భ‌యాందోళ‌న కూడా క‌నిపించ‌లేదు. పుట్టిన‌వాడు గిట్ట‌క త‌ప్ప‌దు అన్న భ‌గ‌వ‌ద్గీత‌ సారాంశం పుక్కిట ప‌ట్టిన వాడిగా - అంద‌రినీ ధైర్యంగా ఉండాల‌ని చెప్పేవారు. అంతేకాదు.. ఓవైపు నాగార్జున‌ - ఆ కుటుంబ స‌భ్యులు ఎంతో బాధ‌ - ఆందోళ‌నతో క‌నిపించేవారు. ఆయ‌న మాత్రం నిశ్చ‌లమ‌న‌స్కుడిగానే క‌నిపించేవారు. ఆ ధీర‌త్వం ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్యం. పొగిడేవాడు శ‌త్రువు.. తెగిడేవాడే మిత్రుడు! అని చెబుతుండేవారు అక్కినేని. ఇలాంటి కొటేష‌న్స్ ఆయ‌న నిర్మించిన అన్న‌పూర్ణ స్టూడియోస్‌ లో ద‌ర్శ‌న‌మిస్తాయి. అవి ఎంద‌రికో స్ఫూర్తిమంతం. నేడు అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా..