Begin typing your search above and press return to search.

హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్

By:  Tupaki Desk   |   7 Oct 2016 5:01 AM GMT
హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్
X
ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీవీ ఛానెళ్లలో వస్తున్న అర్థరహితమైన చర్చలు.. శ్రుతి మించి పోయిన వాదోపవాదనలు చూస్తున్నాం. ముఖ్యంగా సెలబ్రెటీలే ఈ అంశంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇలాంటి టైంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అద్భుతమైన మాటలు చెప్పాడు. నిన్న రాత్రి ట్విట్టర్లో అతను ఒక ఉద్వేగభరితమైన వీడియో ఒకటి పెట్టాడు. ఓ ఆర్మీ అధికారి కొడుకైన అక్షయ్.. మన సైనికుల గురించి మనసు కదిలించే మాటలతో కట్టిపడేశాడు. ఆలోచన రేకెత్తించాడు.

ఓవైపు సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే.. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు ఎక్కడ అని.. పాకిస్థాన్ ఆర్టిస్టులపై బ్యాన్ గురించి.. యుద్ధం వస్తుందేమో అన్న భయాందోళనల గురించి చర్చలు పెట్టడం ఎంత వరకు సబబని అక్షయ్ ప్రశ్నించాడు. ఇలాంటి చర్చల విషయంలో సిగ్గు పడాలని.. సైనికుల గురించి ఆలోచించాలని అక్షయ్ అన్నాడు. సరిహద్దుల్లో 19 మంది సైనికులు చనిపోయారని.. తాజాగా బారాముల్లాలో నితిన్ యాదవ్ అనే 24 ఏళ్ల వీర జవాను ప్రాణాలు వదిలారని.. అందరూ వీళ్ల గురించి ఆలోచించాలని అక్షయ్ పిలుపునిచ్చాడు.

ఈ వీర జవాన్లకు.. వారి కుటుంబాలకు ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చలన్నీ అనవసరమని.. ఒక సినిమా విడుదలవుతుందా లేదా అన్నది వారికి పట్టదని అక్షయ్ అన్నాడు. ఈ సైనికుల కుటుంబాల భవిష్యత్తు గురించి అందరూ ఆలోచించి వారికి భరోసా ఇవ్వాలని.. సైన్యమే లేకుండా తనతో పాటు ఎవరూ ఉండరని.. అసలు దేశం ఉనికే ఉండదని గొప్ప మాట చెప్పాడు అక్షయ్. స్ఫూర్తి రగిలించే అతడి మాటలు విన్నాకైనా అవాకులు చెవాకులు పేలుతూ అర్థరహితమైన చర్చలు పెడుతున్న జనాల నోళ్లు మూతపడతాయేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/