Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ తర్వాత ఇతనే..

By:  Tupaki Desk   |   16 Dec 2017 9:16 AM GMT
అమీర్ ఖాన్ తర్వాత ఇతనే..
X
ఇండియన్ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన కథానాయకుల్లో అమీర్ ఖాన్ ఒకడు. స్టార్ హీరో అన్నంత మాత్రాన కమర్షియల్.. మాస్ మసాలా సినిమాలే చేయాల్సిన అవసరం లేదని.. మూసలో వెళ్లకుండా విభిన్నమైన దారిలో.. కొత్త కథలతో ప్రయాణం చేసినా భారీ విజయాలు అందుకోవచ్చని రుజువు చేశాడు అమీర్. ‘లగాన్’తో మొదలుపెడితే.. ‘దంగల్’ వరకు అమీర్ సినిమాల్లో హీరోయిజం అంతగా కనిపించదు. అందరికీ కనెక్టయ్యే.. భావోద్వేగాలతో నిండిన కొత్త తరహా కథలు.. పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలిచాడు అమీర్. అతడు ఎంచుకున్న ప్రతి పాత్రా.. వాటి కోసం అతను పడ్డ కష్టం ఆశ్చర్యపరిచేవే. మిగతా బాలీవుడ్ హీరోలు అమీర్‌ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

అమీర్ తర్వాత అంత ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుస్తున్న హీరో అక్షయ్ కుమారే. అమీర్ అయినా కెరీర్ మొదట్నుంచి భిన్నమైన పాత్రలే చేస్తున్నాడు కానీ.. అక్షయ్ అలా కాదు. మొదట్లో అతను ఊర మాస్ సినిమాలు చేశాడు. యాక్షన్ సినిమాలకే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత ఎక్కువగా కామెడీ సినిమాలు చేశాడు. కానీ గత కొన్నేళ్లలో అక్షయ్ లో చాలా మార్పు వచ్చింది. ఎవ్వరూ ఊహించని భిన్నమైన పాత్రలతో అతను ఆశ్చర్యపరుస్తున్నాడు. బేబీ.. రుస్తుమ్.. ఎయిర్ లిఫ్ట్.. జాలీ ఎల్ ఎల్బీ.. ఇలా అతను ఎంచుకున్న ప్రతి సినిమా వైవిధ్యంగా ఉంటోంది. సామాన్యమైన పాత్రలతో అతను మెప్పిస్తున్నాడు. ఇక అక్షయ్ చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ అయితే ఒక సంచలనమే. టాయిలెట్ చుట్టూ నడిచే కథతో ఒక సూపర్ స్టార్ సినిమా చేయడం మామూలు విషయం కాదు. సందేశాత్మక కథను వినోదాత్మకంగా చెప్పి మెప్పించింది ఆ చిత్ర బృందం. ఆ తర్వాత ఇప్పుడు ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సెన్సేషనల్ మూవీతో రెడీ అయ్యాడు అక్షయ్. రుతుక్రమ సమయంలో మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్ చుట్టూ తిరిగే కథతో అక్షయ్ లాంటి హీరో సినిమా చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అసలు ఓ దర్శకుడు ధైర్యంగా ఇలాంటి కథతో సినిమా చేయడానికి తయారయ్యాడంటే అది అక్షయ్ లాంటి స్టార్ సపోర్ట్ ఉండటం వల్లే. ఈ సినిమా విజయవంతమైతే అక్షయ్ ఇమేజ్ ఎంతో పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి స్టార్ ఇమేజ్ గురించి పట్టించుకోకుండా గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తూ అమీర్ లాగే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు అక్షయ్.