Begin typing your search above and press return to search.
'కత్తి' ని ఝలిపించే వీరుడెవరో?
By: Tupaki Desk | 21 Aug 2018 6:22 AM GMTఏ.ఆర్.మురుగదాస్ ఎంచుకునే కథలపై ఇటు టాలీవుడ్ - అటు బాలీవుడ్ మేకర్స్ కి ఉన్న గురి అంతా ఇంతా కాదు. అతడి సినిమాల రీమేక్ హక్కులకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకుని వాటిలో సందేశం ఇస్తూ కమర్షియల్ బ్లాక్‌బస్టర్లు కొట్టడంలో మురుగ అంతటి ఘనాపాటి వేరొకరు ఇండియాలోనే లేరు. సరిగ్గా ఇదే పాయింట్ ఆకర్షించి ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి - సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు మురుగదాస్ కథల్ని కొనుక్కున్నారు. వాటి రీమేక్ లతోనూ సక్సెసయ్యారు.
మెగాస్టార్ కెరీర్ లోనే సంచలన విజయం సాధించిన `ఖైదీనంబర్ 150` క్రెడిట్ మురుగదాస్ కే వెళుతుంది. ఆ కథ మెగాస్టార్ కి అంతగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు కత్తి (ఖైదీనంబర్ 150) రీమేక్ హక్కుల్ని సంజయ్ లీలా భన్సాలీ ఛేజిక్కించుకోవడంతో ఈ సినిమాకి దర్శకుడెవరు? హీరో ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదివరకూ మురుగదాస్ రమణ (ఠాగూర్-చిరు) హక్కులు ఛేజిక్కించుకుని క్రిష్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. అది గబ్బర్ పేరుతో రిలీజై పెద్ద సక్సెసైంది. రాజమౌళి `విక్రమార్కుడు` చిత్రానికి ప్రభుదేవాని ఎంపిక చేసుకున్నాడు. రీమేక్ లకు తాను దర్శకత్వం వహించడు కాబట్టి.. ఈసారి కూడా కత్తి రీమేక్ ని ఓ సౌత్ దర్శకుడికి అప్పగిస్తాడా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. పనిలో పనిగా ఈ సినిమాలో కూడా కిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తాడా? లేదూ ఖాన్ లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుంటాడా? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.
కిలాడీ అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. అసలు అపజయం అన్నదే లేని హీరోగా దూసుకుపోతున్నాడు. రీసెంటుగా రైతు కం సైంటిస్ట్ `ప్యాడ్ మ్యాన్` సినిమాతో అక్కీ అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే రైతు నేపథ్యం ఉన్న కత్తి రీమేక్‌లో అతడే అయితే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం.. దర్శకనిర్మాత భన్సాలీ మైండ్ లో ఎవరున్నారో?