Begin typing your search above and press return to search.

ఖిలాడీ సామ్రాట్ ఏంటీ ఇలా దొరికిపోయాడు?

By:  Tupaki Desk   |   5 Jun 2022 4:37 AM GMT
ఖిలాడీ సామ్రాట్ ఏంటీ ఇలా దొరికిపోయాడు?
X
ఒక్కోసారి ఏం చేసినా కాలం క‌లిసి రాదు. ప్ర‌తిదీ రివ‌ర్స్ అవుతుంది. పాజిటివిటీ క‌నిపించ‌క‌పోగా నెగెటివ్ ఫ‌లితం వెక్కిరిస్తూ ఉంటుంది. కిలాడీ అక్ష‌య్ కుమార్ స‌న్నివేశం ఇప్పుడు అలానే ఉంది. గ‌త కొంత‌కాలంగా అత‌డిపై నెటిజ‌నుల్లో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. అత‌డు న‌టించిన సినిమాలు ఫ్లాపుల‌వుతున్నాయి. అత‌డు చేసే ప్ర‌తి కామెంట్ కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. దీనిపై నెటిజనులు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక‌ర‌కంగా అత‌డికి ఊపిరాడ‌నివ్వ‌డం లేదు.

ఇంత‌కుముందు జాతీయ‌ భాషా చ‌ర్చ‌లో.. అలాగే పాన్ ఇండియా సినిమాల గురించిన డిబేట్ లో అతడి కామెంట్ల‌పై నెటిజ‌నులు తీవ్రంగా ట్రోల్ చేసారు. ఇటీవ‌ల వ‌రుస‌గా అక్షయ్ కుమార్ చేసే ప్రతి ప‌ని ట్రోల‌ర్స్ కు ఆహారంగా మారుతోంది. అక్షయ్ లేటెస్ట్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ ఇటీవ‌ల‌ విడుదలైంది. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

తొలిరోజు వ‌సూళ్లు మ‌రీ తీసిక‌ట్టుగా ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ అక్ష‌య్ హోప్ తో ప్ర‌చారం చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌గా దీనిపై నెటిజ‌నులు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదేమి కామెడీ? చూస్కోలేదా? అంటూ అక్ష‌య్ ని అత‌డి టీమ్ ని కూడా అప‌హాస్యం చేస్తున్నారు.

ఇంత‌కీ ఈ ఫోటోలో లోపం ఏమిటీ? అంటే.. గ్రేట్ సామ్రాట్ పృథ్వీరాజ్ (ఖిలాడీ అక్ష‌య్) ని తాళ్ల‌తో శిలువ త‌ర‌హాలో బంధించారు. అతడికి గొలుసులు కూడా వేశారు. త‌న‌తో పాటే సామ్రాట్ స్నేహితుడైన‌ సోనూ సూద్ ఇత‌ర బృందాన్ని కూడా క‌ట్టివేసినట్లు ఆ ఫోటోలో క‌నిపిస్తోంది. ఈ ఫోటోని నేరుగా అక్షయ్ షేర్ చేయ‌డంతో రివ‌ర్స్ పంచ్ లు ప‌డిపోతున్నాయ్.

ఈ ఫోటోలో అలాగే వీడియోలో స్ప‌ష్ఠంగా ప‌రిశీలిస్తే అత‌డికి క‌ట్టిన‌ తాళ్లు చాలా వదులుగా క‌నిపిస్తున్నాయి. నిజానికి అత‌డు వాటిని ఎవ‌రి స‌హ‌కారం లేకుండా సులభంగా తొల‌గించుకోవ‌చ్చు. ఎస్కేప్ అవ్వొచ్చు. కానీ అలా చేయ‌లేదు. నిజానికి పాఠ్యపుస్తకాలలో కొంత స్థలం అవసరమయ్యేంత గొప్ప‌ సినిమా తీసామ‌ని అత‌డు ఇంత‌కుముందే ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు ఎరక్క‌పోయి దొరికిపోయాడు. అక్ష‌య్ అంత పెద్ద బ్లండ‌ర్ మిస్టేక్ ఎలా చేస్తారు? అంటూ ఈ ఫోటోని చూపిస్తూ ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప‌లువురు దీనిపై జోకులు వేస్తున్నారు. భారతీయ పాఠశాల టెక్ట్స్ బుక్స్ లో ప్ర‌చురించాల్సిన క‌థ పృథ్వీరాజ్ క‌థ అని అక్కీ అన్నారు కానీ అంటూ ట్విట్టర్ లో ప‌లువురు విభేదించారు. అక్ష‌య్ ని దారుణంగా ట్రోల్ చేసారు.

`విద్యార్థులకు సరైన చరిత్రను బోధించాలి` అంటూ ట్విట్ట‌ర్ లో విభిన్న వ‌ర్గాలు ర‌క‌ర‌కాల అంశాల‌ను తెర‌పైకి తెచ్చాయి. అతని ప్రకటన ట్విట్టర్ లో చీలికలకు దారితీసింది. ఇదీ అక్ష‌య్ స్ట‌డీ అంటూ అతని కెనడియన్ పౌరసత్వంపైనా చర్చకు తెర తీసారు. అక్షయ్ తన హీరోయిన్ల విష‌యంలో కూడా ట్రోలింగుకి గుర‌య్యాడు. గత 25 ఏళ్లలో అక్షయ్ చేసిన సినిమాలు.. అతని వయస్సు సంబంధిత విష‌యాల‌ను ప్ర‌స్థావిస్తూ.. అతని హీరోయిన్ వయస్సును పోల్చి ట్రోలింగ్ చేసారు.

55 దాటిన అక్ష‌య్ కి పాతిక ప్రాయం నాయిక‌లు అవ‌స‌ర‌మా? అంటూ ప్ర‌శ్నించారు. పృథ్వీరాజ్ లో మానుషి చిల్లర్ లాంటి స‌గం వ‌య‌సు ఉన్న అమ్మాయికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే.. ఇత‌ర సినిమాల్లోనూ స‌గం వ‌య‌సున్న అమ్మాయిలతో అక్ష‌య్ రొమాన్స్ చేసాడ‌ని గుర్తు చేసారు.
సామ్రాట్ పృథ్వీరాజ్ ను థియేట‌ర్ల‌లోకి తీసుకురావడానికి 18 ఏళ్ల పరిశోధనా కాలం పట్టిందని అక్ష‌య్ ఇంత‌కుముందు ట్వీట్ చేసినప్పుడు అప్ప‌టికి హీరోయిన్ వయస్సు 7 సంవత్సరాలు అని ట్రోలర్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తూ రిప్లయ్ లు ఇచ్చారు. ఏది ఏమైనా అక్ష‌య్ కి ఈ సీజ‌న్ లో ఎదురైనంత ట్రోలింగ్ ఇంకెప్పుడూ ఎదురు కాలేదు. గ‌త ఐదారేళ్ల‌లో అత‌డి హ‌వా ఒక రేంజులో సాగింది.

ఇటీవ‌ల పాన్ ఇండియా సినిమాల వెల్లువ‌లో హిందీ హీరోల గ్రాఫ్ ని త‌గ్గిస్తూ ట్రోలర్స్ చెల‌రేగుతున్న క్ర‌మంలో ఆ సెగ ఖిలాడీ కుమార్ ని తాకింది. అత‌డు సౌత్ నుంచి వ‌చ్చే పాన్ ఇండియా హీరోల నుంచి పోటీ త‌ట్టుకోలేక ఒత్తిడిలో ప‌డిపోతున్నాడ‌ని ఇప్పుడు నెటిజ‌నుల్లో స‌రికొత్త డిబేట్ కొన‌సాగుతోంది.