Begin typing your search above and press return to search.

ఖిలాడీ ప్ర‌య‌త్నం ఈ సారైనా ఫ‌లిస్తుందా?

By:  Tupaki Desk   |   28 July 2022 2:30 AM GMT
ఖిలాడీ ప్ర‌య‌త్నం ఈ సారైనా ఫ‌లిస్తుందా?
X
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్ష‌య్ కుమార్ దాదాపు ఏడు సినిమాల‌తో బిజీగా వున్నాడు. బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్న హీరోగా అక్ష‌య్ పేరు గ‌త కొంత కాలంగా మారుమోగుతున్న విష‌యం తెలిసిందే. అత్య‌ధిక పారితోషికాన్ని సొంతం చేసుకుంటూ ఖాన్ ల త్ర‌యాన్ని వెన‌క్కి నెట్టిన అక్ష‌య్ ఈ ఏడాది దారుణంగా నిరాశ ప‌రిచాడు. ఆయ‌న న‌టించిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ ఫ‌లితాల్ని అందుకుని భారీ న‌ష్టాల‌ని మిగిల్చాయి.

ఈ ఏడాది ప్రారంభంలో అక్ష‌య్ న‌టించిన `బ‌చ్చన్ పాండే` భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. కానీ ఆశించిన ఫ‌లితాన్ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయింది. తీవ్రంగా నిరాశ ప‌రిచింది. ఇక ఆ త‌రువాత పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన `సామ్రాట్ పృథ్వీరాజ్‌` కూడా షాక‌చ్చింది. ఈ సినిమా షోల‌ని సైతం ర‌ద్దు చేశారంటే ఏ స్థాయిలో డిజాస్ట‌ర్ గా నిలిచిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా వుంటే ఈ బాలీవుడ్ ఖిలాడీ ఆగ‌స్టు 11న మ‌రో సినిమాతో రాబోతున్నాడు.

ఆనంద్ ఎల్ రాయ్ రూపొందించిన లేటెస్ట్ మూవీ `ర‌క్షా బంధ‌న్‌`. నలుగురు చెల్లెళ్ల‌కు అన్న‌గా అక్ష‌య్ ఈ మూవీలో క‌నిపించ‌బోతున్నాడు. ప‌క్కా ఫ్యామిలీ డ్రామాగా ఆనంద్ ఎల్. రాయ్ ఈ మూవీని రూపొందించారు. తండ్రి నుంచి వ‌చ్చిన ఛాట్ షాప్ ని న‌డుపుతూ న‌లుగురు చెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం ఇబ్బందులు ప‌డే పాత్ర‌లో అక్ష‌య్ న‌టించారు. ఆత్యంతం వినోదాత్మ‌కంగా సాగే ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీని జీ స్టూడియోస్ తో క‌లిసి ఆనంద్ ఎల్ రాయ్,ఆల్కా హీరా నందాని నిర్మిస్తున్నారు.  

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత అక్ష‌య్ న‌టిస్తున్న `రామ్‌ సేతు` హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంద‌ని తెలుస్తోంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, నుస్ర‌త్ బ‌రూచా హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు.

ఇదే మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో స‌త్య‌దేవ్ బాలీవుడ్ కు పరిచ‌యం కాబోతున్నాడు. అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌, లైకా ప్రొడ‌క్ష‌న్ ల‌తో క‌లిసి కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్‌, అబున్ డాంటియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్నాయి.
 
ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని అక్ష‌య్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఖిలాడీ ప్ర‌య‌త్నం `రామ్ సేతు`తో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియాలంటే అక్టోబ‌ర్ 24 వ‌ర‌కు వేచి చూడాల్సిందే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు.