Begin typing your search above and press return to search.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాస్తా మ్యూజికల్ నైట్ ఎందుకైంది?

By:  Tupaki Desk   |   7 Jan 2020 3:53 AM GMT
ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాస్తా మ్యూజికల్ నైట్ ఎందుకైంది?
X
గతంలో సినిమాల్ని ప్రమోట్ చేసే తీరు.. ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. గతం లో ఆడియో ఫంక్షన్.. సినిమా విడుదలయ్యాక శత దినోత్సవం లాంటి రెండు.. మూడు మాత్రమే ఉండేవి కానీ.. ఇప్పుడు ఫస్ట్ లుక్ నుంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకూ చాలానే వచ్చేశాయి. సినిమా సక్సెస్ అయితే సక్సెస్ మీట్ అంటూ ప్రెస్ మీట్ పెట్టటమే కానీ.. గతంలో మాదిరి శతదినోత్సవాలన్నవే లేవు. ఆ మాటకు వస్తే.. అలాంటి ఉత్సవాల్ని మర్చిపోయి చాలాకాలమే అయ్యింది.

గతంలో సినిమా ఒక ప్రయాణంలా సాగేది. ఇప్పుడు అది మారి పోయింది. సినిమా ఆయువు ఇప్పుడు మహా అయితే మూడు రోజులు. ఆ మూడు రోజులు అదిరే టాక్ వస్తే.. ఒక వారం.. మరో పెద్ద సినిమా లేకుంటే రెండోవారం. అంతకు మించి ఎక్కువ రోజులు థియేటర్ల లో కొనసాగే పరిస్థితులు ఇప్పుడు లేవు. మారుతున్న కాలానికి తగ్గట్లు గా మిగిలిన అంశాలు మారినా.. మారకున్నా సినిమా ఫంక్షన్లు చేసే తీరు మాత్రం మారిపోతున్నాయి.

తాజాగా సినిమా ఫంక్షన్ చేయటానికి మరో కొత్త పదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సినిమా విడుదలకు ముందు చేసే ప్రీరిలీజ్ ఫంక్షన్ పేరు మార్చేశారు. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ నైట్ నిర్వహించారు.

ఎందుకిలా? అనే దానికి త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చేశారు. సామజవరగమన పాటను ఏకంగా 13 కోట్ల మంది విన్నారని చెబుతూ.. పాట మనకు ఊతం.. మనకు గురువు.. మనకు ప్రేయసి అని.. అలాంటి అందమైన పాటల్ని గౌరవించాలనే మ్యూజికల్ నైట్ అని పేరు పెట్టి వేడుకను నిర్వహించినట్లు గా చెప్పారు. ఈ కారణంతోనే ప్రీరిలీజ్ ఫంక్షన్ కాస్తా మ్యూజికల్ నైట్ అయ్యింది. ఇకపై.. ఈ పేరుతో మరో కార్యక్రమాన్ని అదనంగా చేసుకునే వీలు త్రివిక్రమ్ పుణ్యమా అని షురూ అవుతుందేమో చూడాలి.