Begin typing your search above and press return to search.

యాస‌తో మాయావి అన్ని ప్ర‌యోగాలా?

By:  Tupaki Desk   |   27 Dec 2019 2:30 PM GMT
యాస‌తో మాయావి అన్ని ప్ర‌యోగాలా?
X
ప్రాంతీయ యాస‌ను భాష‌ను ఉప‌యోగించ‌డం ద్వారా ఆ ప్రాంతానికి క‌నెక్ట‌యిపోవ‌డం సులువు. ఈ లాజిక్ ని ఫాలో చేయ‌డంలో మ‌న ద‌ర్శ‌కుల త‌ర్వాత‌నే. ముఖ్యంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఇందులో రాటు దేలిపోయారు. స్వ‌త‌హాగా ఆయ‌న ర‌చ‌యిత కావ‌డంతో మాండ‌లీకాలు.. యాస‌ల్ని బాగా ప‌రిశీలించి వాటిని త‌న సినిమాల‌కు అనుగుణంగా ఉప‌యోగించుకుంటారు. ఇప్ప‌టికే తెలుగు భాష‌లోని అన్ని మాండ‌లికాల్ని.. యాస‌ల్ని త్రివిక్ర‌ముడు త‌న సినిమాల‌కు ఉప‌యోగించుకున్నారు.

ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. ఇందులో చిత్తూరు యాస‌తో పాటు శీకాకుళం యాస‌ను వాడేస్తున్నాడ‌ట‌. అయితే ఈసారి తెలివిగా పాట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థ‌మ‌న్ అందించిన చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ యూత్ లోకి దూసుకెళ్లాయి. ఇప్ప‌టికే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం నుంచి రిలీజైన అన్ని లిరిక‌ల్ వీడియోలు యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయాయి అంటే అది మెచ్చాల్సిన విష‌య‌మే. సామ జ‌వ‌ర‌గ‌మ‌న‌...రాములో రాముల‌... ఓ మైగాడ్ డాడీ... బుట్ట‌ బొమ్మ .. అంటూ నాలుగు పాట‌ల్ని లాంచ్ చేశారు. అవ‌న్నీ చార్ట్ బ‌స్ట‌ర్లు అయ్యాయి.

ఈసారి ఓ జాన‌ప‌ద గీతంతో శ్రోత‌ల ముందుకు రానున్నార‌ట‌. ప‌క్కా శ్రీ‌కాకుళం యాస‌తో కూడుకున్న జాన‌ప‌ద గీతాన్ని అల బృందం వినిపిస్తార‌ట‌. ఇప్ప‌టికే రాముల రాముల పాట‌లో నైజాం యాస వినిపించిన త్రివిక్ర‌ముడు.. ఈసారి శ్రీ‌కాకుళం యాస‌పై దృష్టి సారించారనే అంటున్నారు. ఇక ఈ పాట‌ను పాడిన‌ది శ్రీ‌కాకుళానికి చెందిన జాన‌ప‌ద క‌ళాకారుడు అని తెలుస్తోంది. థ‌మ‌న్ బీట్ కి శ్రీ‌కాకుళం యాస‌కు మెర్జింగ్ కుదిరితే మ‌రో చార్ట్ బ‌స్ట‌ర్ ఖాయ‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. అల వైకుంఠ‌పుర‌ములో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ‌వుతోంది.