Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: అలాద్దిన్ వచ్చాడోచ్

By:  Tupaki Desk   |   13 March 2019 6:26 AM GMT
ట్రైలర్ టాక్: అలాద్దిన్ వచ్చాడోచ్
X
కొన్ని కథలకు పరిచయమే అవసరం లేదు. అలాంటి కథల్లో 'అలాద్దిన్' ఒకటి. మనవాళ్ళు తెలుగులో అయన పేరునే అల్లావుద్దీన్ అంటారు. ఇలాంటి కథల ప్రత్యేకత ఏంటంటే.. మనకు కథ పూర్తిగా తెలుసు.. ఏం జరుగుతుందో తెలుసు... చివరికి ఏమౌతుందో కూడా తెలుసు. అసలేమాత్రం సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉండదు. కానీ మొదటి నుంచి చివరివరకూ అలాద్దిన్ తో మనం ప్రయణిస్తాం. అలాద్దిన్ కు డబ్బులేనప్పుడు మనకు డబ్బు లేనట్టు ఫీల్ అవుతాం. జినీ ఉన్న మ్యాజిక్ ల్యాంప్ దొరికి అదృష్టవంతుడిగా మారినప్పుడు మనమే రాజులాగా మారిపోయామని అనుకుంటాం. అందుకే ఇన్నేళ్ళయినా ఈ కథ ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరినీ అలరిస్తోంది. వాల్ట్ డిస్నీ వారు ఈ కథను బేస్ చేసుకొని 1992 లో యానిమేటెడ్ ఫిలింను రిలీజ్ చేశారు.. ఇప్పుడు అదే కథను మరోసారి సినిమాగా మలిచారు.

గై రిచీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్ ఫ్యాంటసీలో మెనా మస్సూద్ అలాద్దిన్ పాత్రలో నటించగా హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ జినీగా నటించాడు. జాస్మిన్ యువరాణి పాత్రలో నవోమి స్కాట్ నటించింది. మాంత్రికుడు జఫార్ పాత్రలో మార్వాన్ కెంజారి నటించాడు. సుల్తాన్ పాత్రలో నవిద్ నెగాబెన్ నటించాడు. అలాద్దీన్ దగ్గర ఉండే పెంపుడు కోతి పాత్రకు గాత్రం అందించింది ఫ్రాంక్ వెల్కర్. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అలన్ మెన్కన్.

ట్రైలర్ లో ఒక సీన్ లో హీరోను "ఏం కావాలో కోరుకో" అంటాడు విల్ స్మిత్. "నన్ను రాకుమారుడిని చెయ్యి" అంటాడు హీరో. అలాంటి క్లారిటీ లేని కోరికలు కాదు సరిగ్గా కోరుకో.. అంటాడు విల్ స్మిత్. అలా సలహా చెప్తూ 'నువ్వు అడిగింది ఇంతే' అన్నట్టుగా దూరంగా రాజకుమారుడి గెటప్ లో ఉన్న హీరో ప్రతి రూపాన్ని చూపిస్తాడు. రాజకుమారుడు అంటే జస్ట్ డ్రెస్ వేసుకొని రాజకుమారుడిలా కనిపిస్తే ఏం ఉపయోగం? రాజ్యం.. రాజభవనం.. డబ్బు.. బంగారం.. భటులు ..సైన్యం.. అంతా ఉండాలి కదా. డైలాగ్ చిన్నదే అయినా ఇలాంటి సీన్స్ తో మీనింగ్ ఫుల్ గా ఉండేలా తీర్చిదిద్దారు.

విల్ స్మిత్ నటన గురించి అందరికీ తెలిసిందే. అద్భుత దీపం నుండి బయటకు వచ్చిన జినీలా అదరగొట్టాడు. కండలు తిరిగిన దేహం.. నీలి రంగు శరీర వర్ణం.. పిల్లి గడ్డంతో చిన్నపిల్లలను వెంటనే ఆకట్టుకునేలా ఉన్నాడు. సాధారణ సినిమాలాగా కాకుండా మ్యూజికల్ ఫ్యాంటసీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టి పాటలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం మే లో రిలీజ్ కానుంది. ఆలస్యం ఎందుకు.. వెంటనే ట్రైలర్ చూసేయండి.