Begin typing your search above and press return to search.

అక్కినేని త‌ర్వాత ఆ రికార్డు అలీదేన‌ట‌!

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:30 PM GMT
అక్కినేని త‌ర్వాత ఆ రికార్డు అలీదేన‌ట‌!
X
టాలీవుడ్ లోని సుప్ర‌సిద్ధ క‌మెడియ‌న్ ల‌లో అలీ ఒక‌రు. అలీ పేరు చెబితేనే ప్రేక్ష‌కుల పెదాల‌పై న‌వ్వులు విర‌బూస్తాయి. 5 భాషల్లో దాదాపు 1100 చిత్రాల్లో నటించిన అరుదైన ఘ‌న‌త అలీ సొంతం. చైల్డ్‌ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన అలీ...ఆ త‌ర్వాత‌ కమెడియన్‌ - హీరో - క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ - అలీ 369 - అలీతో జాలీగా వంటి కార్య‌క్ర‌మాల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను కూడా అలీ విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా అలీ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ‘యమలీల’ - ‘పిట్టలదొర’లతో క‌ల‌పుకొని ఇప్ప‌టివ‌ర‌కు 52 చిత్రాల్లో నటించానంటే త‌న‌కే ఆశ్చర్యం వేస్తోంద‌ని అలీ అన్నారు.

ఏ ఏడాది ఏప్రిల్‌ 28కి ‘యమలీల’విడుద‌లై 24 ఏళ్ల‌వుతుంద‌ని - ఆ తేదీకి చాలా ప్ర‌త్యేక‌త ఉంద‌ని అలీ అన్నారు. స‌రిగ్గా అదే తేదీన‌ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ - ‘పోకిరి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు విడుద‌ల‌య్యాయ‌ని అలీ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లోని శ్రీనివాస థియేటర్ లో ‘యమలీల’ నాన్ స్టాప్ గా 365 రోజులు ఆడింద‌ని - అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారి ‘ప్రేమాభిషేకం’ త‌ర్వాత ఆ రికార్డు త‌న‌దేన‌ని అలీ చెప్పారు. అందుకే, ఆ థియేట‌ర్లో ప్రేమాభిషేకం షీల్డ్‌ పక్కన యమలీల షీల్డ్ కూడా పెట్టార‌ని అన్నారు. ఆ రోజున థియేటర్ లో ఓ వ్యక్తి తన వేలు కోసుకుని రక్తంతో తిలకం పెట్టాడ‌ని - అమ్మ గురించి గొప్పగా చూపించావ‌ని కంటతడి పెట్టుకున్నాడ‌ని గుర్తు చేసుకున్నారు. ఆర్టిస్టులు వేసే పాత్రల‌కు ప్రేక్ష‌కులు ఏవిధంగా క‌నెక్ట్ అవుతార‌నేదానికి ఇదో ఉదాహ‌ర‌ణ అన్నారు. దుబాయ్ లో నివ‌సించే అప్ఘాన్ టాక్సీ డ్రైవర్ అక్క‌డ త‌న‌ను గుర్తు ప‌ట్టి సెల్ఫీ తీసుకున్నాడ‌ని - బలవంతం చేసినా టాక్సీ డబ్బులు తీసుకోలేద‌ని చెప్పారు. అంబానీ రిల‌య‌న్స్ ఆఫీసులో సీఈవో కొంతమందికే ప‌రిచ‌య‌మ‌ని - ఆర్టిస్టులు ప్ర‌పంచం న‌లుమూల‌లా పాపుల‌ర్ అని చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న‌ పుణ్యం వ‌ల్లో ఈ జన్మలో ఆర్టిస్టుగా పుట్టానని - అదే త‌న‌కూ - త‌న కామెడీకీ పెద్ద టానిక్ అని అన్నారు.