Begin typing your search above and press return to search.

నెగెటివ్ ప్ర‌చారంపై ఆలీ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   31 May 2022 6:29 AM GMT
నెగెటివ్ ప్ర‌చారంపై ఆలీ షాకింగ్ కామెంట్స్
X
ఒక స్టార్ హీరో సినిమా విడుద‌లైతే ఆ హీరో యాంటీ ఫ్యాన్స్ సినిమా పోయిందంటూ ఈ మ‌ధ్య విచిత్రంగా నెగెటివ్ ప్ర‌చారం చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. అంతే కాకుండా పక్క వారి సినిమా పోయింద‌ని ఇత‌ర సినిమా టీమ్ హ్యాపీగా ఫీల‌వ్వ‌డం కూడా ఇటీవ‌లే మొద‌లైంది. దీనిప‌సై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లెవెత్తుతున్నాయి. తాజాగా దీనిపై క‌మెడియ‌న్ ఆలీ తీవ్రంగా స్పందించారు. ఓ సినిమా పోతే మ‌రో సినిమా వాళ్లు చంక‌లు గుద్దు కోవ‌డం ఏంటో నాకు అర్థం కావ‌డం లేద‌ని షాకింగ్ కామెంట్ లు చేశారు. వివ‌రాల్లోకి వెళితే..

విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుష్ తేజ్ హీరోలుగా న‌టించిన తాజా చిత్రం `ఎఫ్ 3`. మ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ మూవీని తెర‌కెక్కించారు. 2019లో వ‌చ్చిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎఫ్ 2` సిరీస్ లో భాంగా తెర‌కెక్కిన మూవీ ఇది. ఈ మూవీని కూడా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. త‌మ‌న్నా, మెహ్రీన్ , సొనాల్ చౌహాన్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలి రోజు తొలి షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకుని హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ అనిపించుకుంది.

అయితే ఈ మూవీపై కొంత మంది నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నారు. దీనిపై `ఎఫ్ 3` స‌క్సెస్ మీట్ వేదిక‌గా షాకింగ్ కామెంట్స్ చేశారు క‌మెడియ‌న్ అలీ. `ఎఫ్ 3` స‌క్సెస్ మీట్ లో పాల్గొన్న అలీ ఈ మూవీపై వ‌స్తున్న వార్త‌ల‌పై గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మాకు సినిమానే సర్వ‌స్వం అని, అది త‌ప్ప మాకు ఏదీ చేత‌కాద‌న్నారు. అంతే కాకుండా మాకు ఎలాంటి వ్యాపారాలు లేవ‌ని తెలిపారు. ఓ సినిమా హిట్ అయితే నిర్మాత బాగుంటాడ‌ని, ఓ నిర్మాత బాగుంటే ద‌ర్శ‌కుడు బాగుంటాడ‌ని, ఆ త‌రువాత ఆర్టిస్ట్ లు అంతా బాగుంటార‌న్నారు.

అయితే కొంత మంది హిట్ అయిన సినిమా బాగాలేదంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని, వాళ్లు కూడా వుండేది ఇదే ఇండ‌స్ట్రీలోనే అని, ఇది త‌ప్ప వాళ్ల‌కు ఏదీ చేత‌కాద‌ని చుర‌క‌లంటించారు. ఓ సినిమా బాగుందంటే ఆ మూవీ చేసిన డైరెక్ట‌ర్ హ్యాపీగా ఫీల‌వుతాడ‌ని, యూనిట్ మొత్తం ఆనందిస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

ఇండ‌స్ట్రీని న‌మ్ముకుని చాలా మంది వున్నార‌ని, వేల మంది ఇండ‌స్ట్రీ వ‌ల్ల బ్ర‌తుకుతున్నార‌న్నారు. ద‌య‌చేసి సినిమాల‌పై త‌ప్పుడు ప్ర‌చారాలు మానుకోవాల‌న్నారు. చెన్నైలో ఉన్న స‌మ‌యంలో మేం ఇలాంటి వార్త‌లు వినలేద‌ని, ఈ మ‌ధ్య కాలంలోనే ఇలాంటివి మ‌రీ ఎక్కువ అయ్యాయ‌న్నారు.

ఓ సినిమా పోతే మ‌రో సినిమా వాళ్లు చంక‌లు గుద్దుకోవ‌డం ఏంటో నాకు అర్థం కావ‌డం లేద‌న్నారు. ద‌య‌చేసి ఇలాంటివి మానేయండి అంటూ విజ్ఞ‌ప్తి చేశారు. అవ‌త‌లివారు బాగుండాలి అనుకుంటే భ‌గ‌వంతుడు మిమ్మ‌ల్ని వాడికంటే బాగా ఉండేలా చేస్తాడ‌ని, ఆ విష‌యం ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తు పెట్టుకోవాల‌న్నారు. ఇక `ఎఫ్ 3`లో త‌న‌ని అనిల్ రావిపూడి చాలా బాగా చూపించాడ‌ని, మంచి పాత్ర ఇచ్చాడ‌న్నారు ఆలీ. క్లైమాక్స్ లో త‌న చేతికి ఓ గ‌న్ ఇచ్చి కామెడీ చేయించార‌ని, ఎక్క‌డికి వెళ్లినా అంతా ఆ గ‌న్ గురించే అడుగుతున్నార‌ని తెలిపారు ఆలీ.