Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురితో అనుకున్నా ముడిపడలేదు.. చివరకు అలియాకు దక్కింది

By:  Tupaki Desk   |   3 March 2022 4:30 AM GMT
ఆ ముగ్గురితో అనుకున్నా ముడిపడలేదు.. చివరకు అలియాకు దక్కింది
X
కరోనా కారణంగా భారీగా దెబ్బ తిన్న చిత్ర పరిశ్రమ ఏదైనా ఉందంటే.. అది బాలీవుడ్డేనని చెప్పాలి. టాలీవుడ్.. కోలీవుడ్.. శాండల్ వుడ్.. ఇలా అన్ని వుడ్ లు అంతో ఇంతో ప్రభావితమైనా.. హిందీ సినిమాలకు ఎదురైనన్ని సవాళ్లు మిగిలిన భాషా చిత్రాలకు పెద్దగా ఎదురు కాలేదని చెప్పాలి. మూడు వేవ్ లు ముగిసిన తర్వాత సైతం.. బాలీవుడ్ మూవీలు పెద్దగా మెరవని పరిస్థితి. ఒకప్పుడు రెండు.. మూడు వారాలకు ఒక పెద్ద హీరో మూవీతోనో.. క్రేజీ కాన్సెప్టుతో వచ్చే సినిమాతో హిందీ సినిమాలకు సంబంధించి ఒకలాంటి బజ్ ఉండేది. కరోనా పుణ్యమా అని అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదనే చెప్పాలి.

మూడో వేవ్ కు కాస్త ముందుగా విడుదలైన బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైనా.. అవేమీ బాక్సాఫీస్ వద్ద ప్రభావితం చేసేలా లేకపోవటం గమనార్హం. ఇలాంటి వేళలో విడుదలైంది అలియా భట్ నటించిన గంగూభాయ్ కథియావాడికి. సంజయ్ లీలా బన్సాలీ తీసిన ఈ మూవీ నిర్మాణం నుంచి కూడా ప్రత్యేకమైన ఆసక్తి వ్యక్తమైంది. ఒక లేడీ డాన్ కు అలియా అసలు సరిపోతారా? అన్న సందేహం పలువురిలో వ్యక్తమైంది. గ్లామరస్ హీరోయిన్ పాత్రలతో పాటు.. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించే అలియా.. గంగూభాయ్ చిత్రానికి ఓకే చెప్పిన నాటి నుంచి.. ఈ సినిమా మీద బోలెడంత ఆసక్తి వ్యక్తమైంది.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మీద పాజిటివ్ రిపోర్టులు రావటంతో పాటు.. అలియా అద్భుత నటనకు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా కోసం ఆమెలోని నటిని మరో స్థాయిలో బయటకు తీశారని చెప్పక తప్పదు. అంతేనా.. ఈ సినిమా చూసిన తర్వాత.. ఆమె నటించిన గంగుభాయ్ పాత్రను అలియా తప్పించి.. మరింకెవరూ కూడా నటించలేరన్న భావన కలుగక మానదు. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా.. తొలి ఐదు రోజుల్లోనే రూ.57 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు.

ఒక యువ కథానాయకి అయి ఉండి కూడా మాఫియా క్వీన్ గా నటిస్తుందా? ఆమె ఆ పాత్రకు సూట్ అవుతుందా? అన్న సందేహాల్ని ఆమె పటాపంచలు చేయటమే కాదు.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత మహదేవ అన్న రీతిలో గంగూభాయ్ పాత్రలో అలియా చెలరేగిపోయారని చెప్పాలి. ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చి పెట్టిన వైనంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో.. ఈ సినిమా షూటింగ్ కు ముందు.. గంగుభాయ్ పాత్రకు ఎవరిని అనుకున్నారన్న చర్చకు వస్తే.. తొలుత అలియాభట్ ను అస్సలు అనుకోలేదట. ఆమె స్థానంలో ముగ్గురు అగ్ర హీరోయిన్లను అడిగినా.. ఆ పాత్ర కోసం వారు అంతగా స్పందించలేదు.

తొలుత గంగుభాయ్ కు బాలీవుడ్ నటి దీపికా పదుకునేను అనుకున్నారట. కానీ.. ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో.. ఓకే అనలేకపోయారట. అనంతరం ప్రియాంక చోప్రాను అనుకున్నా.. హాలీవుడ్ లో ఆమె పలువురికి కమిట్ మెంట్స్ ఇవ్వటంతో వారు నో చెప్పారట. ఇలాంటి వేళ.. రాణి ముఖర్జీని అనుకున్నా.. వ్యక్తిగత కారణాలతో ఆమె అందుకు నో చెప్పటంతో.. ఏం చేయాలో పాలుపోలేదట. అలాంటి వేళలోనే అలియా గుర్తుకు రావటం.. ఆమెను సంప్రదించటం.. అందుకు ఆమె ఓకే చెప్పేశారట. అందరి అంచనాలకు భిన్నంగా అలియా భట్ ఈ మూవీతో ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకురావడం కోసం.. అందరి మదిలో గంగూభాయ్ గా రిజిస్టర్ అయిపోయారు.

రాసి పెట్టి ఉంటే.. ఏమనుకున్నా.. ఎవరెంతగా అడ్డుకున్నా.. దక్కాల్సిన వారికి మాత్రమే దక్కటమన్న విషయం గంగుభాయ్ ఎపిసోడ్ మరోసారి నిరూపితమైందని చెప్పక తప్పదు.