Begin typing your search above and press return to search.

హీరోయిన్ సినిమా 200 కోట్లు దాటేసింది

By:  Tupaki Desk   |   22 Jun 2018 6:30 AM GMT
హీరోయిన్ సినిమా 200 కోట్లు దాటేసింది
X
హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమా అంటేనే భయపడేవాళ్లు ఒకప్పుడు. ఆ సినిమా ఎంత గొప్పగా తీసినా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేవని.. కలెక్షన్లు రావని అనుకునేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారింది. అటు బాలీవుడ్లో.. ఇటు దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ పెరిగింది. హిందీలో కంగనా రనౌత్.. తెలుగులో అనుష్క.. తమిళంలో నయనతార లాంటి వాళ్లు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో అందరి దృక్పథాన్ని మార్చేవారు. హిందీలో ‘క్వీన్’ సహా చాలా సినిమాలు బాగా ఆడాయి. దక్షిణాదిన ‘అరుంధతి’తో పాటు ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అద్భుత విజయాన్నందుకున్నాయి. సరిగ్గా తీస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కమర్షియల్‌గా మంచి ఫలితాన్నందుకోగలవని ఈ చిత్రాలు రుజువు చేశాయి.

తాజాగా ఈ కోవలోనే మరో సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి పాఠాలు నేర్పింది. ఆ చిత్రమే... రాజి. ఆలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ హిందీ సినిమా అద్భుత విజయాన్నందుకుంది. ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.207 కోట్ల గ్రాస్ సాధించిందట. విడుదలైన ఐదు.. ఆరు వారాల్లో కూడా ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే రూ.100 కోట్ల మార్కుకు చేరువైన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి ఏంకగా రూ.200 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో ఈ చిత్రం ఒకటి. దేశం కోసం పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక మిషన్ మీద పని చేసే అమ్మాయి పాత్రలో ఆలియా అద్భుత అభినయం చూపించింది ఈ సినిమాలో. సినిమా కూడా చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేసిన ‘రాజి’ని కరణ్ జోహార్ నిర్మించాడు.