Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరో ఎట‌కారం హ‌ద్దులు దాటేసిందిగా?

By:  Tupaki Desk   |   16 April 2019 4:42 AM GMT
బాలీవుడ్ హీరో ఎట‌కారం హ‌ద్దులు దాటేసిందిగా?
X
నిత్యం బ‌తికేది రాజ‌కీయం మ‌ధ్య‌నే. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా దేశంలోని ఏ ఒక్క‌రూ రాజ‌కీయాల‌కు ప్ర‌భావితం కాకుండా బ‌త‌క‌లేరు. అలాంట‌ప్పుడు చీద‌ర రాజ‌కీయాల్ని మార్చేలా ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నం చేస్తే ఎంతో కొంత మార్పు వ‌స్తుంది. అంతేకానీ.. రాజ‌కీయాలంటే త‌న‌కు న‌చ్చ‌వ‌ని చెప్పే క్ర‌మంలో ఎట‌కారం చేయ‌టం స‌రికాదు. ఒక‌వేళ ఎట‌కారం చేసినా డీసెంట్ గా చేస్తే స‌రి.

కానీ.. రాజ‌కీయాల మీద త‌న‌కుండే ఏహ్య‌భావాన్ని హ‌ద్దులు దాటేలా వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాదు. తాజాగా అలాంటి వ్యాఖ్యే చేశాడో బాలీవుడ్ హీరో. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. సినీ న‌టులు.. సెల‌బ్రిటీలు.. ఇలా ఏ వ‌ర్గానికి చెందిన వారి కార్య‌క్ర‌మం అయినా.. ఏదోలా రాజ‌కీయ ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది.

కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌ల‌నొప్పులు త‌ప్ప‌వు. తాజాగా బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. క‌పిల్ శ‌ర్మ నిర్వ‌హించే షోకు త‌న తాజా చిత్రమైన క‌ళంక్ ప్ర‌మోష‌న్ లో భాగంగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ముఖ న‌టి ఆలియాభ‌ట్ కూడా ఉన్నారు. ఈ మ‌ధ్య‌న ఈ అమ్మ‌డు ఎక్క‌డికి వెళ్లినా రాజ‌కీయాల గురించి ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. షోలో కూడా ఆమెకు రాజ‌కీయ ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. మీరు రాజ‌కీయ‌పార్టీ స్థాపిస్తే మీ పార్టీ గుర్తు ఏమిట‌ని ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన ఆలియా.. తాను రాజ‌కీయ పార్టీ పెడితే.. పార్టీ గుర్తుగా ప్లేట్ ను ఎంపిక చేసుకుంటాన‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ దాన్ని ఎవ‌రూ సెలెక్ట్ చేసుకోలేదంటూ చెప్పారు. రోజువారీ జీవితంలో ప్లేట్ కున్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాద‌న్నారు.

ఆలియా ఇంత జాగ్ర‌త్త‌గా బ‌దులిస్తే.. వ‌రుణ్ ధావ‌న్ మాత్రం అందుకు భిన్నంగా త‌న పార్టీ గుర్తును చెడ్డీగా ఎంపిక చేసుకుంటాన‌ని చెప్పారు. అత‌గాడి నుంచి ఇంత ముత‌క మాట వ‌స్తుంద‌ని ఊహించ‌ని వారు ఒక్కక్ష‌ణం అవాక్కు అయ్యారు. ఆ త‌ర్వాత లైట్ తీసుకొని న‌వ్వేశారు. నిజ‌మే.. రాజ‌కీయాలు మురికికూపంగా భావిస్తుంటారు కొంద‌రు. అంత మాత్రాన మ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా నాటుగా మాట్లాడేయ‌టం స‌రికాదు. వ‌రుణ్ ధావ‌న్ మాట‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. క‌దిలించి కంప మీద వేసుకోవటం అంటే ఇదేనేమో?