Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మరీ ఇంత సాగిలపడిపోవాలా?

By:  Tupaki Desk   |   25 Nov 2020 1:30 AM GMT
టాలీవుడ్ మరీ ఇంత సాగిలపడిపోవాలా?
X
తెలుగు సినిమా పరిశ్రమకు పూర్తిగా సహకరిస్తాం అని ఆరేళ్లుగా మాటలు చెప్పడమే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నది వాస్తవం. ఐతే వివిధ కారణాల వల్ల సినీ పరిశ్రమ మాత్రం ప్రభుత్వానికి పూర్తి విధేయతతో ఉంటూ వస్తోంది. సినీ పెద్దలు కేసీఆర్‌, కేటీఆర్‌లను ఎంతగా గౌరవిస్తారో.. వారి అభిమానం చూరగొనేందుకు ఎంతగా ప్రయత్నిస్తారో పలు సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాల్లో ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు. ఈ మధ్య హైదరాబాద్ వరదల నేపథ్యంలో కూడా విరాళాలు ప్రకటించారు. ఐతే ఇన్నాళ్లూ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనో ఏమో వరాలు ప్రకటించారు. చిన్న సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్, కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీల రద్దు, థియేటర్లలో టికెట్ల రేట్లు, షోలు పెంచుకునే వెలుసుబాటు లాంటి వరాలు ప్రకటించారు.

ఇవన్నీ పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలే. వాటిని ఇండస్ట్రీ స్వాగతించాల్సిందే. ఐతే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి పెద్దలు వెంటనే ట్విట్టర్లో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం బాగానే ఉంది. కానీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మాండేటరీ అన్నట్లుగా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ మెసేజ్‌లు పెట్టడమే సినీ ప్రియులకు రుచించట్లేదు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా నటీనటులు, నిర్మాతలు, టెక్నీషియన్లు నిన్న సాయంత్రం నుంచి ఇదే పనిగా పెట్టుకున్నారు. ఇండస్ట్రీ పెద్దలు పనిగట్టుకుని అందరికీ చెప్పి ఈ పని చేయిస్తున్నారా లేక ఎవరికి వాళ్లు తామెక్కడ మిస్ అయిపోతామో, ఎందుకొచ్చిన గొడవ అనుకుని మెసేజ్‌లు పెడుతున్నారో కానీ.. కేసీఆర్‌ను తెగ పొగిడేస్తూ పెడుతున్న పోస్టులైతే నెటిజన్లకు రుచించట్లేదు. ప్రభుత్వానికి మరీ ఇంత భయపడాలా.. సాగిలపడాలా అంటూ వారిని కౌంటర్ చేస్తున్నారు.