Begin typing your search above and press return to search.

ఇంతకీ విజయ్ ఎంట్రీ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   8 Nov 2018 5:26 AM GMT
ఇంతకీ విజయ్ ఎంట్రీ ఎప్పుడు?
X
దేశంలో సినీ రంగానికి.. రాజకీయ రంగానికి అతి దగ్గర సంబంధాలున్నది తమిళనాడులోనే. మిగతా చోట్ల సినీ ప్రముఖులు రాజకీయాల్లో లేకేం కాదు. కానీ తమిళ రాజకీయాల్లో ఉన్నంతగా సినిమా వాళ్ల ప్రభావం మరెక్కడా లేదు. తమిళనాడు ఏర్పాటయ్యాక అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నది సినిమా వాళ్లే. కొన్ని దశాబ్దాల పాటు కరుణానిధి.. ఎంజీఆర్.. జయలలిత రాజ్యమేలారు. జయ మరణం తర్వాత కానీ సాధారణ రాజకీయ నేతలు సీఎం కాలేదు. జయ-కరుణల మరణాణంతరం నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేస్తున్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారు. వీరి తర్వాత రాజకీయాల పట్ల అమితాసక్తిని ప్రదర్శిస్తున్న స్టార్ హీరో విజయ్.

ఇప్పటిదాకా విజయ్ బహిరంగంగా రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. తన రాజకీయారంగేట్రం గురించి ప్రస్తావించింది లేదు. కానీ తన సినిమాల ద్వారా తన ఉద్దేశాల్ని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. గతంలో ‘తలైవా’ అనే సినిమాలో విజయ్ తన రాజకీయ ఉద్దేశాల్ని చాటి చెప్పాడు. ఇక గత ఏడాది ‘మెర్శల్’లో సామాజికాంశాల ప్రస్తావన.. తనను తాను ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘సర్కార్’ పూర్తిగా రాజకీయాల చుట్టూ సాగిన సినిమా. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఇదొక మార్గం లాగా కనిపించింది. అతను అతి త్వరలోనే రాజకీయారంగేట్రం చేయబోతున్నాడేమో అన్న సంకేతాలిచ్చిందీ చిత్రం. తమిళనాట సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఈ సినిమాలో కనిపిస్తోంది. ఏ పార్టీని వదలకుండా అందరి మీదా సెటైర్లు పడ్డాయి. సినిమాలో హీరో మాదిరే తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి మార్పు తీసుకొస్తానన్న ఉద్దేశాన్ని విజయ్ చాటే ప్రయత్నం చేశాడని అంటున్నారు. మరి విజయ్ 2020 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజకీయారంగేట్రం చేసేస్తాడా.. రజనీ-కమల్ లాంటి ఉద్దండుల్ని ఢీకొడతాడా? చూద్దాం మరి.