Begin typing your search above and press return to search.

మొత్తానికి గిల్డ్ మాటే నెగ్గింది కానీ..!

By:  Tupaki Desk   |   1 Aug 2022 4:30 PM GMT
మొత్తానికి గిల్డ్ మాటే నెగ్గింది కానీ..!
X
పెరిగిన నిర్మాణ భారం, ఆర్టిస్ట్ ల పారితోషికాలు, ఓటీటీ రిలీజ్ లు, టికెట్ రేట్ల పెరుగుద‌ల వీటి కార‌ణంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్లకు పెద్ద‌గా రాక‌పోవ‌డం.. ఇండ‌స్ట్రీలో వున్న ఫెడ‌రేష‌న్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు పిలుపు నిస్తున్నామంటూ యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స్ప‌ష్టం చేసింది. అయితే ముందు నుంచి వీరి బంద్ పిలుపుకు మ‌ద్దతు తెల‌ప‌ని నిర్మాత‌ల మండ‌లి ఫైన‌ల్ గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. తాము కూడా షూటింగ్ ల‌ బంద్ కు పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్నామంటూ ప్ర‌క‌టించింది.

దీంతో ఆగ‌స్టు 1 నుంచి అన్ని సినిమాల షూటింగ్ లు నిక‌వ‌ధికంగా బంద్ పాటించ‌డం మొద‌లు పెట్టాయి. ఈ విష‌యంలో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మొత్తానికి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా చెప్పిన స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తాయా? అన్న‌దే ఇప్ప‌డున్న ప్ర‌శ్న‌. రెమ్యున‌రేష‌న్‌లు, బ‌డ్జెట్ నియంత్ర‌ణ‌, టికెట్ రేట్ల త‌గ్గింపు, ఓటీటీల క‌ట్ట‌డి, మేజర్ అండ్ మీడియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని అదుపు చేయ‌డం వంటివి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ త‌మ కీల‌క అంశాల్లో చేర్చింది. ఇందులో సినిమా బ‌డ్జెట్ లు, పారితోషికాలు ఎంత వ‌ర‌కు త‌గ్గుతాయ‌న్న‌దే ప్ర‌ధాన ట్విస్ట్ గా మారింది.

క్యూబ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల ద్వారా వ‌ర్చువ‌ల్ ప్రింట్ ఫీజు ను ర‌ద్దు చేయ‌డం, చిన్న సినిమాల టికెట్ రేట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం, రోజు వారీ కూలీల వేత‌నాల‌ని పెద్ద సినిమాల‌కు, చిన్న సినిమాలకు ఒక‌లాగా ఖ‌రారు చేయ‌డం వంటి ప్ర‌ధాన డిమాండ్ ల‌ని ప‌రిష్క‌రిస్తామ‌ని నిర్మాత‌ల మండ‌లి వెల్ల‌డించింది. అయితే రెమ్యున‌రేష‌న్ ల త‌గ్గింపు గురించి మాత్రం ఎక్క‌డా మాట్లాడ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా గిల్డ్ ప్రొడ్యూస‌ర్స్ లేవ‌నెత్తిన స‌మ‌స్యే ఇది.

స్టార్ హీరోలు, హీరోయిన్ లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల పారితోషికాల కార‌ణంగా, వారి అస్టెంట్ ల కార‌ణంగానే అధికంగా అద‌న‌పు ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయ‌ని, త‌ద్వానా బ‌డ్జెట్ లు ఆకాశాన్నంటుతున్నాయ‌ని, ఆ విష‌యంలో స‌మూల మార్పుల కోస‌మే షూటింగ్ లు బంద్ కు వెళుతున్న‌ట్టుగా గిల్డ్ స‌భ్యులు ముందు నుంచి చెబుతూ వ‌స్తున్నారు. ఆ డిమాండ్ ని విస్మ‌రించి నిర్మాత‌ల మండ‌లి గిల్డ్ స‌భ్యుల‌తో ఆ ఒక్క‌టి త‌ప్ప అంటూ బంద్ కు పిలుపు నివ్వ‌డం విడ్డూరంగానే వుంది అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. మ‌రి దీనిపై త‌రువాత గిల్డ్ కు , నిర్మాత‌ల మండ‌లికి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

బంద్ కు ముందే చాలా మంది ప్రొడ్యూస‌ర్ లు గిల్డ్ రెమ్యున‌రేష‌న్ లు త‌గ్గించుకోవాల‌న్న డిమాండ్ ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ విష‌యంపై మ‌ళ్లీ చ‌ర్చ జ‌రిగితే అస‌లు స‌ఖ్య‌త ఏంట‌న్న‌ది బ‌య‌ట‌ప‌డ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతా గిల్డ్ నిర్ణ‌యానికే సై అంటారా? లేక త‌మ నిర్ణం తాము తీసుకుంటామ‌ని బంద్ ని నిలిపేస్తారా? అన్న‌ది రెండు మూడు రోజుల్లో తేలే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.