Begin typing your search above and press return to search.

ఐదు రోజుల్లో `వ‌కీల్ సాబ్` థియేట‌ర్లన్నీ బంద్

By:  Tupaki Desk   |   21 April 2021 3:30 PM GMT
ఐదు రోజుల్లో `వ‌కీల్ సాబ్` థియేట‌ర్లన్నీ బంద్
X
గ‌త కొంత‌కాలంగా ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ డి.సురేష్ బాబు థియేట‌ర్ల బంద్ గురించి హింట్ ఇస్తూనే ఉన్నారు. ఏ క్ష‌ణం అయినా త‌మ థియేట‌ర్ల‌న్నిటినీ మూసివేస్తామ‌ని ఆయ‌న అన్నారు. అన్నంత ప‌నీ చేస్తున్నారు కూడా.

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఒకే ఒక్క సినిమా ఆడుతోంది. ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ మిన‌హా ఇంకే సినిమా లేదు. ఇక ఈ సినిమా అయినా ఉంటుందా? అంటే అది కూడా ఐదు రోజుల త‌ర్వాత క‌నిపించ‌ద‌ట‌. ఆరో రోజు వ‌కీల్ సాబ్ ఆడుతున్న థియేట‌ర్లు కూడా మూసేస్తార‌ని తెలిసింది. సింగిల్ థియేట‌ర్లు మ‌ల్టీప్లెక్సులు ఎక్క‌డా వ‌కీల్ సాబ్ ఉండ‌దు.

ఎగ్జిబిటర్లు స్వ‌చ్ఛందంగా తీసుకున్న నిర్ణ‌య‌మిది. ఓవైపు సెకండ్ వేవ్ ప్ర‌భావంతో జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని ఎగ్జిబిట‌ర్లు చెబుతున్నారు. కరోనావైరస్ వ్యాప్తి వ‌ల్ల‌ ఎగ్జిబిటర్లు - పంపిణీదారులు `వకీల్ సాబ్` ను ప్రదర్శిస్తున్న వాటిని మినహాయించి అన్ని థియేటర్లను నేటి నుంచి మూసివేయాలని నిర్ణయించారు. వ‌కీల్ సాబ్ స్క్రీనింగ్ జరుగుతున్న చోట అన్ని థియేటర్లలో మరో 5 రోజులు నడుస్తుంది. 6వ రోజు నుండి కనుమరుగవుతుంది. కొంద‌రైతే ఈ ఐదు రోజులు ఆడించ‌ర‌ట‌. దానికి కార‌ణం క‌లెక్ష‌న్లు దారుణంగా ప‌డిపోవ‌డ‌మేన‌ని తెలిసింది.

హైద‌రాబాద్ లోని డి.సురేష్ బాబు -ఏషియ‌న్ సార‌థ్యంలోని ఓ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ లో నిన్నంతా 20 మంది ప్రేక్షకులు మాత్రమే వ‌చ్చార‌ట‌. నగరం నడిబొడ్డున ఉన్న మరొక మల్టీప్లెక్స్ అన్ని ప్రదర్శనలకు 25 మంది ప్రేక్షకులను చూసింది. ఆ విధంగా థియేటర్లకు విద్యుత్ బిల్లు కూడా రావడం లేదు. కాబట్టి దిల్ రాజు నియంత్రణలో ఉన్న థియేటర్లు మినహా మిగతావన్నీ ఈ రోజు నుండి మూతపడుతున్నాయని తెలిసింది. సెకండ్ వీకెండ్ లో శ‌ని-ఆదివారాలు వ‌సూళ్లు లేక‌పోవ‌డంతో వ‌కీల్ సాబ్ థియేట‌ర్లు వెల‌వెల‌బోతున్నాయి. అందుకే ఇక థియేటర్ల‌ను మూసేస్తున్నారు.