Begin typing your search above and press return to search.

పుట్టిన రోజు నాడే చనిపోయే సీన్ చేయాల్సొస్తే..

By:  Tupaki Desk   |   3 Jan 2016 9:30 AM GMT
పుట్టిన రోజు నాడే చనిపోయే సీన్ చేయాల్సొస్తే..
X
కెమెరా ముందు చేసేదంతా నటనే అయినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో నటించడం ఎవరికైనా ఇబ్బందే. అందులోనూ చనిపోయే సన్నివేశాలు చేయాలంటే ఎవరికైనా అదోలాగే ఉంటుంది. అందులోనూ పుట్టిన రోజు నాడు చనిపోయే సన్నివేశం చేయడం ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. ‘గమ్యం’ సినిమాకు అలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నానని అంటున్నాడు అల్లరి నరేష్. 50 సినిమాల మైలురాయిని అందుకున్న నేపథ్యంలో తన కెరీర్ లోని మలుపుల్ని గుర్తు చేసుకుంటూ ‘గమ్యం’ సినిమా అనుభవాల్ని పంచుకున్నాడు అల్లరోడు.

ఆ సినిమాలో తాను చనిపోయే సన్నివేశంలో నటించన రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటానని నరేష్ చెప్పాడు. ‘‘యాదృచ్ఛికంగా నా పుట్టిన రోజు నాడే ఆ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. అమ్మకు ఫోన్ చేసి చెబితే వద్దే వద్దు అని చెప్పింది. కానీ నాన్న మాత్రం ఏం పర్వాలేదు చేసేయమన్నారు. కానీ నటిస్తుంటే నాకే అదోలా అనిపించింది. ఆ తర్వాత అమ్మ ఏడ్చేసింది. ఇంకెప్పుడూ పుట్టిన రోజు అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని అమ్మ మాట తీసుకుంది’’ అని నరేష్ చెప్పాడు.

ఇక గమ్యం సినిమాకు డైరెక్టర్ క్రిష్ పడ్డ కష్టాల గురించి చెబుతూ.. ‘‘ఈ సినిమాకు ఏడుగురు నిర్మాతలు మారారు. శర్వానంద్ కంటే ముందు ఏడుగురు హీరోలు కూడా మారారు. చివరికి సినిమా అనుకున్న నాలుగేళ్లకు మొదలుపెట్టబోయాం. రేపో ఎల్లుండే షూటింగ్ మొదలవబోతుండగా అప్పటికి ఉ్న నిర్మాత పక్కకు వెళ్లిపోయాడు. దీంతో క్రిష్ స్వయంగా నిర్మాణానికి ముందుకొచ్చాడు. కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక డబ్బుల్లేక బ్రేక్ పడేది. ఓ పది లక్షలు దొరికితే ఇంకో రెండు మూడు రోజులు షూటింగ్ చేసేవాళ్లం. ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని సినిమా పూర్తి చేసి.. 2008 ఫిబ్రవరి 29న సినిమాను విడుదల చేయగలిగాం’’ అని నరేష్ చెప్పాడు.