Begin typing your search above and press return to search.

ఈవీవీ చనిపోయి నరేష్‌ బాధపడుతుంటే..

By:  Tupaki Desk   |   23 Oct 2016 1:30 PM GMT
ఈవీవీ చనిపోయి నరేష్‌ బాధపడుతుంటే..
X
సినిమా వాళ్లయినంత మాత్రాన వాళ్లకు ఎమోషన్లు ఉండకుండా పోవు కదా. వాళ్లూ మనుషులే కదా. ఆ విషయం తెలియకుండా సమయం సందర్భం లేకుండా వాళ్లను విసిగించేస్తుంటారు అభిమానులు. ఆ మధ్య చిరంజీవి ఒక వేడుకకు హాజరై తిరిగి వెళ్తుంటే ఓ అభిమాని విసిగించడం.. ఆయన కోప్పడ్డం గుర్తుండే ఉంటుంది. ఇంకో సందర్భంలో బాలయ్య అసహనం ఆపుకోలేక అభిమాని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా చాలామంది నటీనటులు కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. అలా తాను కూడా ఓసారి సహనం కోల్పోయానని అంటున్నాడు అల్లరి నరేష్. తన తండ్రి పోయిన బాధలో తాను ఉంటే ఓ అభిమాని తనతో ప్రవర్తించిన తీరుకు కోపం వచ్చేసిందన్నాడు నరేష్.

‘‘ఎంత నటులైనా సరే.. సామాన్యులకు ఎలాగైతే ఉద్వేగాలుంటాయో మాకూ అలాగే ఉంటాయి. కొన్నిసార్లు కొందరి విపరీత ప్రవర్తన కోపం తెప్పిస్తుంది. అలాంటుడు నటుణ్ణి కదా అని కంట్రోల్‌ చేసుకోవడం కష్టం. మా నాన్న చనిపోయినప్పుడు పార్ధివ దేహం అక్కడే ఉంది. నేను పక్కనే ఉన్నాను. ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. చాలా కోపం వచ్చేసింది. బయటికి వెళ్లు.. ఇది ఫోటో తీసుకునే సమయమా అని కోప్పడ్డాను. దానికీ కొందరు విమర్శించారు. నటులకు కోపతాపాలు.. వ్యక్తిగత జీవితం ఉండదా? దానికి విలువ ఇవ్వాలి కదా’’ అని నరేష్ అన్నాడు. ఇక కెరీర్లో ఫెయిల్యూర్ల గురించి చెబుతూ.. ‘‘నా ఫెయిల్యూర్ల నుంచి నేను నేర్చుకోవడాని కంటే ముందే మా నాన్న ఫెయిల్యూర్ల నుంచి చాలా నేర్చుకున్నా. ఒకప్పుడు మా నాన్నకు హిట్లు వచ్చినప్పుడు ఇంటి ముందు 24 కార్లుండేవి. ఫ్లాపులు వచ్చినప్పుడు రెండు కార్లు కూడా లేని పరిస్థితులు చిన్న వయసులోనే చూశాను. అవన్నీ నాకు పాఠాలు నేర్పించాయి. కాబట్టి విజయాన్ని తలకెక్కించుకోను. అపజయం వచ్చినప్పుడూ కుంగిపోను’’ అని నరేష్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/