Begin typing your search above and press return to search.

అల్ల‌రోడి న‌వ్వుల జ‌ర్నీకి ఇర‌వైఏళ్లు

By:  Tupaki Desk   |   10 May 2022 9:30 AM GMT
అల్ల‌రోడి న‌వ్వుల జ‌ర్నీకి ఇర‌వైఏళ్లు
X
కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ల‌కి కెరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన హీరోలు న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, న‌రేష్‌.. ఈ ఇద్ద‌రు హీరోలు తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌మ‌దైన కామెడీతో హాస్య చిత్రాలని అందించిన క‌డుపుబ్బా న‌వ్వించారు. వారి త‌రువాత ఆ ప‌రంప‌ర‌ని కొనసాగిస్తూ త‌న‌దైన మార్కు హాస్యంతో అల‌రిస్తున్నారు అల్ల‌రి న‌రేష్‌. ఆయ‌న హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం 'అల్ల‌రి'. న‌టుడు ర‌విబాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2002 మే 10న విడుద‌లై నేటికి స‌రిగ్గా 20 ఏళ్ల‌వుతోంది.

తొలి చిత్రం స‌క్సెస్ కావ‌డంతో సినిమా పేరే ఇంటిపేరుగా మారిపోయి 'అల్ల‌రి' న‌రేష్ అయ్యారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యాన‌ర్ పై ర‌విబాబు డైరెక్ట్ చేసి ఈ మూవీని నిర్మించారు. డి. సురేష్ బాబు రిలీజ్ చేసిన ఈ మూవీ అల్ల‌రి న‌రేష్ కు హీరోగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అప్ప‌టి వ‌ర‌కు వున్న చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన మేకింగ్ స్టైల్ తో రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ని క‌లిగించింది. అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్ నేప‌థ్యంలో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది.

ఈ చిత్రం ద్వారా న‌రేష్ తో పాటు శ్వేతా అగ‌ర్వాల్‌, నీలాంబ‌రి హీరోయిన్ లుగా ప‌రిచ‌యం అయ్యారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన పాటులు, పాల్ జె అందించిన సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. అంతే కాకుండా ఈ సినిమాని యూత్ కు మ‌రింత ద‌గ్గ‌ర చేశాయి. ఇరవై ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ సినిమా న‌రేష్ కెరీర్ ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు కామెడీ చిత్రాల‌కు న‌టకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, న‌రేష్ లే కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు.

వారి త‌రువాత ఆ ఫార్ములా సినిమాల‌కు న‌రేష్ కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయాడు. ఒక్కో ఏడాది నాలుగు నుంచి ఎనిమిది చిత్రాలు చేస్తూ షిఫ్ట్ ల ప్ర‌కారం ప‌ని చేస్తూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేశాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాది వ‌రుస‌గా మూడు చిత్రాలు చేసిన న‌రేష్ ఆ త‌రువాత 2004 లో నాలుగు సినిమాలు, 2008 లో ఏకంగా ఎనిమిది సినిమాలు, 2010లో ఏడు సినిమాలు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 2021లో వ‌చ్చిన 'బంగారు బుల్లోడు' వ‌ర‌కు కామెడీనే న‌మ్ముకున్న అల్ల‌రోడు 'నాంది' సినిమాతో త‌నలోని కొత్త కోణానికి నాంది ప‌లికాడు.

ఎప్పుడూ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ లు చేసే నరేష్ త‌న పంథాకు పూర్తి భిన్నంగా చేసిన చిత్రం 'నాంది'. ఈ సినిమాతో త‌న‌లోని కొత్త న‌టుడిని ప‌రిచ‌యం చేశాడు. సీరియ‌స్ పాత్ర‌ల్లోనూ త‌న స‌త్తా ఏంటో నిరూపించుకుంటానంటూ కొత్త త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టాడు. ప్ర‌స్తుతం అదే పంథాలో అల్ల‌రి న‌రేష్ రెండు చిత్రాలు చేస్తున్నాడు. 'స‌భ‌కు న‌మ‌స్కారం' అంటూ ఒక సినిమా. .. 'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం' అంటూ మ‌రో సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా న‌రేష్ పంథాకు పూర్తి భిన్నంగా సాగే చిత్రాలే కావ‌డం విశేషం. అల్ల‌రి సినిమాతో న‌వ్వుల జ‌ర్నీని మొద‌లు పెట్టిన అల్ల‌రి న‌రేష్ అప్పుడే త‌న జ‌ర్నీ ప్రారంభించి ఇర‌వై ఏళ్లు పూర్తి కావ‌డంతో ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన లెట‌ర్ ని అభిమానుల‌తో పంచుకున్నారు.

ఈ జ‌ర్నీలో స‌హ‌క‌రించిన టెక్నిషియ‌న్ లు , డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఫ్యాన్స్ ప్రేమ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని వెల్ల‌డించాడు. ఈ ఇర‌వైఏళ్ల జర్నీకి మార్కులు కూడా వేసుకున్నాడు. 20 మార్కుల‌కు త‌న‌కు 59 వ‌చ్చాయంటూ త‌న‌దైన స్టైల్లో చెప్పుకొచ్చాడు.