Begin typing your search above and press return to search.

50వ సినిమాకి ఎనర్జీ బూస్ట్‌

By:  Tupaki Desk   |   2 Aug 2015 6:06 AM GMT
50వ సినిమాకి ఎనర్జీ బూస్ట్‌
X
అల్లరి నరేష్‌ అర్థ శతకం పూర్తి చేసే వేళ కొన్ని గుణపాఠాల్ని నేర్చుకున్నాడు. తప్పటడుగులు తెలిసీ వేయకూడదు. వేస్తే దాని మూల్యం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. ఓ వైపు కథల ఎంపికలో, మరోవైపు మీడియాతో వ్యవహారంలో పూర్తిగా తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయాడు నరేష్‌. సక్సెస్‌ కోసం తపించి సినిమాలు చేసినా .. జనాల ఆలోచనల్ని పసిగట్టడంలో విఫలమై పరాజయాల పాలయ్యాడు. అలాగే శత్రువుకైనా ఉచిత ప్రమోషన్‌ ఇచ్చే మీడియాని ఏ కోణంలో తనవైపు తిప్పుకోవాలో తెలియక తికమకపడ్డాడు. ఏదేమైనా ఇది అతడికి అవసరమైన అనుభవం.

నరేష్‌ సత్తా ఉన్న నటుల్లో ఒకడు అనడంలో సందేహమే లేదు. అతడు రొటీన్‌ కథలో రొటీన్‌ టైపికల్‌ క్యారెక్టర్‌ లో కనిపించినా ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారన్నది మరోసారి రుజువైంది. అతడు నటించిన జేమ్స్‌ బాండ్‌ ఆ సంగతిని నిరూపించింది. సాక్షి చౌదరి గ్లామర్‌, స్టంట్స్‌ ఈ సినిమాకి పెద్ద అస్సెట్‌ అయ్యాయి. సాక్షి హీరోగా నటించిన ఈ సినిమా నరేష్‌ కి బాగానే కలిసొచ్చింది. సరిగ్గా ఇదే టైమ్‌ లో నరేష్‌ కెరర్‌ లో అత్యంత కీలకమైన 50వ సినిమాలో నటిస్తున్నాడు. ఇది తన జీవితానికే మైలు రాయి కావాల్సిన సందర్భం వచ్చింది. అందుకే అతడు జేమ్స్‌ బాండ్‌ విజయాన్ని ఎనర్జీ బూస్టర్‌ లా ఫీలవుతున్నాడు.

కథావైవిధ్యం, సరైన బ్యానర్‌ ఇప్పుడు నరేష్‌ కి అవసరం. అతడిలోని సత్తాని కాసులు కురిపించే కలశంలా మార్చే దర్శకుడు కూడా అత్యంత కీలకం. ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.