Begin typing your search above and press return to search.

మళ్లీ కోలీవుడ్లో అల్లరి నరేష్

By:  Tupaki Desk   |   16 July 2016 12:11 PM IST
మళ్లీ కోలీవుడ్లో అల్లరి నరేష్
X
పాపం హిట్టు కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాడు అల్లరి నరేష్. అతడి నిరీక్షణకు ఇంకా తెరపడలేదు. ఈ శుక్రవారం విడుదలైన ‘సెల్ఫీ రాజా’ కూడా ఆశించిన ఫలితాన్నిచ్చేలా కనిపించట్లేదు. ఐతే ఇన్ని ఫ్లాపులు తింటున్నా అల్లరి నరేష్‌ కు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఆల్రెడీ తెలుగులో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘ఇంట్లో దయ్యం.. నాకేం భయ్యం’ అనే సినిమా ఒకటి.. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్షన్లో ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమా మరొకటి చేస్తున్నాడు. ఇంకా ఒకట్రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. తాజాగా అల్లరోడికి ఓ తమిళ సినిమాలోనూ అవకావం దక్కింది.

‘శంభో శివ శంభో’ ఫేమ్ సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ సినిమాలో కథానాయకుడిగా నటించబోతున్నాడు నరేష్. ‘శంభో..’ సినిమాలో అల్లరోడి పెర్ఫామెన్స్ నచ్చేసి ఇంతకుముందే ఓ తమిళ సినిమాలో నటింపజేశాడు సముద్రఖని. ఆ సినిమా ‘సంఘర్షణ’ పేరుతో తెలుగులోనూ రిలీజైంది. ఐతే ఆ సినిమా పెద్ద ఫ్లాపవడంతో నరేష్‌ కు తమిళంలో బ్రేక్ రాలేదు. ఐతే ఇప్పుడు మళ్లీ అల్లరోడిని కోలీవుడ్‌ కు తీసుకెళ్తున్నాడు. తెలుగులో రొటీన్ సినిమాల దెబ్బకు కుదేలైపోయి ఉన్నాడు నరేష్. కనీసం సముద్రఖని అయినా వైవిధ్యమైన సినిమా తీసి.. అల్లరోడి కెరీర్‌ ను నిలబెడతాడేమో చూడాలి. గతంలో దర్శకుడిగా వరుసగా సినిమాలు తీసిన సముద్రఖని.. ఈ మధ్య నటనమీద దృష్టిపెట్టి దర్శకత్వాన్ని పక్కనబెట్టేశాడు. తాజాగా తనే హీరోగా ‘అప్పా’ అనే సినిమా తీసి హిట్టు కొట్టాడు. వెంటనే అల్లరి నరేష్ తో సినిమా మొదలుపెట్టేస్తున్నాడు.