Begin typing your search above and press return to search.

చరిత్రకారులు మండిపడుతున్నారు గుణా...

By:  Tupaki Desk   |   10 Oct 2015 5:30 PM GMT
చరిత్రకారులు మండిపడుతున్నారు గుణా...
X
చరిత్ర నేపథ్యంలో సినిమాలు తీస్తే ఇదే సమస్య. ఉన్నదున్నట్లు తీస్తే జనాలకు థ్రిల్లుండదు. కొత్తగా ఏదైనా చేస్తే చరిత్రను వక్రీకరించాడంటూ చరిత్రకారులు మండిపడతారు. ఇప్పుడు ‘రుద్రమదేవి’ విషయంలోనూ ఇదే గొడవ నడుస్తోంది. వీరనారి రుద్రమదేవి సినిమా తీస్తూ ఆ పాత్రను తక్కువ చేసి.. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డిని మరీ ఎక్కువ చేసి చూపించాడంటూ గుణశేఖర్ పై చరిత్రకారులు మండిపడుతున్నారు. నాటకీయత కోసం అసలు కథలో కొన్ని మార్పులు చేశానని గుణశేఖర్ టైటిల్స్ పడక ముందే నోట్ ఇచ్చినప్పటికీ.. గోన గన్నారెడ్డిని హీరోను చేయడం కోసం మరీ హద్దులు దాటిపోవడం చరిత్రకారులకు మింగుడు పడటం లేదు.

‘రుద్రమదేవి’ సినిమాకు గోన గన్నారెడ్డి పాత్రే హైలైట్ అని అందరూ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్లైమాక్స్ లో గోన గన్నారెడ్డి స్టీల్స్ ద షో అన్నమాటే. రుద్రమదేవి యుద్ధంలో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండగా.. గోన గన్నారెడ్డి వచ్చి ఆమెను ఆదుకున్నట్లు యుద్ధాన్ని ముగించినట్లు చూపించారు. దానికి ముందు కూడా రుద్రమదేవి కష్టాల్లో ఉన్నపుడల్లా గన్నారెడ్డే సాయం చేసినట్లు.. తెరవెనుక ఆమెకు సాయపడింది మొత్తం గన్నారెడ్డే అన్న కలరింగ్ ఇచ్చారు. కానీ వాస్తవం ఏంటంటే.. గోన గన్నారెడ్డికి నిజంగా అంత సీన్ లేదు. అసలు కథ మొత్తం రుద్రమదేవే నడిపించింది. గన్నారెడ్డి ఆమెకు సాయం చేసిన మాట వాస్తవమే కానీ.. అది సినిమాలో చూపించినట్లుగా అంతా తానే అన్నట్లు కాదు. అసలు భర్త చాళుక్య వీరభద్రుడు కూడా రుద్రమదేవికి పెద్దగా సాయపడింది లేదు. తన బుద్ధిబలంతో, వీరత్వంతో 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది రుద్రమ. గుణశేఖర్ మాత్రం బన్నీ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా అని.. గన్నారెడ్డి పాత్రను బాగా హైలైట్ చేశాడు. ఆ హైలైట్ చేయడం బాగానే ఉంది కానీ.. మరీ గన్నారెడ్డి ముందు రుద్రమదేవిని తక్కువ చేసి చూపించడంతోనే వచ్చింది సమస్య. ఐతే ఏదైతేనేం చరిత్రకారులు ఇంకాస్త గట్టిగా గొడవ చేస్తే ఆ కాంట్రవర్శీ సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతుందేమో చూడాలి.