Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీకి అల్లు అన్యాయం?

By:  Tupaki Desk   |   16 Nov 2017 8:01 AM GMT
మెగా ఫ్యామిలీకి అల్లు అన్యాయం?
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులకు సంబంధించిన వివాదం ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. నందమూరి ఫ్యామిలీ హీరోల సినిమాలకే పెద్ద పీట వేస్తూ.. మెగా హీరోల సినిమాల్ని విస్మరించారంటూ ఆ వర్గానికి చెందిన దర్శకులు.. నిర్మాతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ వాస్.. మారుతి.. బండ్ల గణేష్ లాంటి మెగా క్యాంపులోని ప్రముఖులు నంది అవార్డుల తీరుపై తమ అసంతృప్తిని దాచుకోలేదు. బండ్ల గణేష్ అయితే ఏకంగా ఇవి నంది అవార్డులు కావు, సైకిల్ అవార్డులు అనేశాడు. ఐతే మెగా ఫ్యామిలీకి అన్యాయం చేశారంటూ వీళ్లు చేస్తున్న వాదన మీద నంది అవార్డు కమిటీలోని సభ్యులు ఎదురు దాడి చేశారు.

మెగా ఫ్యామిలీకి అన్యాయం చేసిందంటున్న కమిటీలో అల్లు అరవింద్ కూడా ఉన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఆయనకు కూడా అవార్డుల ఎంపికలో భాగస్వామ్యం ఉందని.. కాబట్టి మెగా ఫ్యామిలీకి ఆయనే అన్యాయం చేసినట్లు భావిస్తారా అని వారు ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవికి రఘుపతి వెంకటయ్య అవార్డు ఆయనే ఇప్పించుకున్నట్లు.. పక్షపాతం ప్రదర్శించినట్లు భావిస్తారా అని వారు ప్రశ్నించారు. ఐతే ఈ విషయమై బండ్ల గణేష్ ఎదురు దాడి చేశాడు. అల్లు అరవింద్ ఇలాంటి విషయాల్లో ఏమీ మాట్లాడరని.. తమ వాళ్లకే అవార్డులు ఇవ్వాలని పట్టుబట్టరని.. తాను కమిటీలో ఉన్నాను కాబట్టి తమ వాళ్లకు అవార్డులు ఇవ్వాలని అడగడం భావ్యం కాదు కాబట్టి సైలెంటుగా ఉంటారని.. అది ఆయన సంస్కారం అని బండ్ల అన్నాడు. దీనిపై వాదోపవాదాలు కొంచెం గట్టిగానే సాగాయి.