Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాత సాయం అంద‌రిలో స్పూర్తి ర‌గిలించాలి

By:  Tupaki Desk   |   22 May 2020 4:45 AM GMT
అగ్ర నిర్మాత సాయం అంద‌రిలో స్పూర్తి ర‌గిలించాలి
X
లాక్ డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వ‌ల‌స కూలీలు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో త‌మ స్వ‌గ్రామాల‌కు త‌ర‌లి వెళ్లిపోతున్నారు. వేలాది కార్మికులు రోడ్ల‌పై వంద‌లు వేల కిలోమీట‌ర్లు న‌డుచుకుంటూనే వెళ్లాల్సిన ధైన్యం నెల‌కొంది. కూలీల‌కు ప్ర‌భుత్వాల వైపు నుంచి ఎలాంటి సాయం అంద‌లేదు. అర‌కొర బ‌స్సు స‌దుపాయాలు మిన‌హా వారిని కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా గాలికి వదిలేసింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వాలే కొంత‌వ‌ర‌కూ బాధ్య‌త‌ను తీసుకున్నాయి. అయినా ఇది స‌రిపోవ‌డం లేదు.

నిత్యం వేలాది కార్మికులు గుంపులు గుంపులుగా రోడ్ల వెంబ‌డి ఎండ‌న‌కా వాన‌న‌కా న‌డుచుకుంటూనే వెళుతున్న దృశ్యాలు క‌ల‌చివేస్తూనే ఉన్నాయి. తిండికి లేక డ‌బ్బు లేక వ‌లస కార్మికులు ప్ర‌యాణ మార్గంలోనే త‌నువు చాలిస్తున్నారు. ఇలాంటి విషాదాలు చూస్తున్న‌వారికి గుండె త‌రుక్కుపోతోంది. అయితే కూలీల్ని ఆదుకునేందుకు సెల‌బ్రిటీలు ఏమీ చేయ‌రా? అంటే..

ఈ విష‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ చేసిన సాయం ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచింది. సోనూసూద్ త‌న సొంత ఖ‌ర్చుల‌తో 20 బ‌స్సులను ఏర్పాటు చేసి వ‌ల‌స కూలీల్ని వారి గ్రామాల‌కు త‌ర‌లించే ఏర్పాటు చేశారు. ఇటీవ‌లే బ‌ర్త్ డే సంద‌ర్భంగా టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ సైతం ఈ త‌ర‌హా సాయం అందించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ఇద్ద‌రూ చేస్తే స‌రిపోతుందా? అందుకే ఒక్కొక్క‌రుగా స్టార్లు నిర్మాత‌లు స్పందిస్తున్నారు.

ఇప్ప‌టికే వ‌ల‌స కూలీల సేవార్థం కొన్ని సామాజిక సేవా సంస్థ‌లు (ఎన్జీవో) త‌మ‌వంతు కృషి చేస్తున్నాయి. అదే బాట‌లో హైద‌రాబాద్ కి చెందిన‌ ప్రైమ్ కంబైన్ ఫౌండేషన్ తన వంతు కృషి చేస్తోంది. `స్టాప్ ది వాక్` పేరుతో వ‌ల‌స కూలీలకు సాయ‌ప‌డుతోంది. ఈ సేవా సంస్థ‌కు తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ విరాళం అందించారు. దీనికి సంబంధించిన వివ‌రాల్ని హీరో అల్లు శిరీష్ అందించారు. ``ప్రైమ్ కంబైన్ ఫౌండేషన్ అద్భుతమైన పని తీరును క‌న‌బ‌రుస్తోది. అయితే ఇంకా చాలా చేయాల్సి ఉంది. వలస కార్మికులకు అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న ఈ ఎన్జీఓకు ప్రజలు ముందుకు వచ్చి సహకరించాలి`` అని శిరీష్ విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును అందుకుని ఇంకా స్టార్లు .. అగ్ర నిర్మాత‌లు స్పందిస్తారేమో చూడాలి.