Begin typing your search above and press return to search.

అల్లు వారిది రివర్స్ ప్లానా?

By:  Tupaki Desk   |   30 April 2018 5:30 PM GMT
అల్లు వారిది రివర్స్ ప్లానా?
X
మెగా ఫ్యామిలీ ఇప్పుడు ప్రతికూల విషయాల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రణాళికను గట్టిగానే అమలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ ను బూతు తిట్టిన ఉదంతం విషయంలో అల్లు అరవింద్.. నాగబాబు లాంటి వాళ్లు కొంచెం అతిగానే స్పందించిన భావన కలిగింది జనాలకు. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశాడని.. తన తల్లి పేరును పదే పదే ప్రస్తావించి.. సంబంధిత వీడియోలను మళ్లీ మళ్లీ షేర్ చేసి సెంటిమెంటు పండించడానికి ప్రయత్నించాడని ప్రత్యర్థులు విమర్శించారు.

ఇప్పుడిక అల్లు అరవింద్ కూడా తన కొడుకు అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవే అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇండస్ట్రీలో తలెత్తిన పరిణామాలు.. తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఈ సినిమాను లక్ష్యంగా చేసుకోవచ్చన్నది ఆయన సందేహం. ప్రత్యర్థులు ఎవరు అని చెప్పకపోయినా కొన్ని టీవీ ఛానెళ్లను ఉద్దేశించే ఆయనీ వ్యాఖ్యలు చేశారని అందరూ భావిస్తున్నారు. ఐతే నిజంగా ఇలా ఆ సినిమా గురించి కుట్ర జరుగుతోందా అన్నది సందేహం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అలా జరగొచ్చేమో అనే సందేహంతో.. లేదా ఈ సినిమాపై డివైడ్ టాక్ రావొచ్చన్న అనుమానంతోనో ముందే ఆయన వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశాడని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవతలి వాళ్లను ముందే డిఫెన్సులోకి నెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారేమో అనిపిస్తోంది.

ఇక్కడొక కీలకమైన విషయం ఏంటంటే.. పవన్ తనకు వ్యతిరేకంగా కుట్ర చేశాయని పేర్కొన్న ఒక టీవీ ఛానెల్లోనూ నిన్నటి ‘నా పేరు సూర్య’ ఆడియో లైవ్ ఇచ్చారు. ఇటు అల్లు అరవింద్.. అటు రామ్ చరణ్ ఇద్దరూ కూడా మీడియాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆ ప్రసంగాల్ని మీడియానే రిపోర్ట్ చేస్తోంది. టెలికాస్ట్ చేస్తోంది. తమ ప్రచారానికి మీడియానే కావాలి. అయినా మీడియానే లక్ష్యంగా చేసుకుంటారు. శ్రీరెడ్డి వ్యవహారంలో కొన్ని టీవీ ఛానెళ్లు అతి చేసిన సంగతి వాస్తవమే. కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న తప్పుల గురించి ఎవరో ఆరోపణలు చేస్తే వాటిని రిపోర్ట్ చేయడమే తప్పు.. ఇక్కడ ఏ తప్పూ జరగట్లేదని మాట్లాడటమే విడ్డూరం.