Begin typing your search above and press return to search.

'వార‌సుడు' వివాదంపై అల్లు అర‌వింద్ ఏమ‌న్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Nov 2022 9:26 AM GMT
వార‌సుడు వివాదంపై అల్లు అర‌వింద్ ఏమ‌న్నారో తెలుసా?
X
త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ త‌మిళ మూవీ 'వారీసు'. టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఆయ‌న సోద‌రుడు శిరీష్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. త‌మిళంలో 'వారీసు'గా తెలుగులో 'వారసుడు'గా ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా భారీ తార‌గ‌ణంతో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టిన ఈ సినిమాని సంక్రాంతిని తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇదే ఇప్ప‌డు టాలీవుడ్ లో వివాదంగా మారింది. గ‌తంలో త‌మిళ సినిమాలు ఫెస్టివెల్ స‌మ‌యంలో రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని, తెలుగు సినిమాకు మాత్ర‌మే ప్రాధాన్య‌త నివ్వాల‌ని నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్ర‌కారం దిల్ రాజు క‌ట్టుబ‌డ‌కుండా సంక్రాంతి పండ‌గ సీజ‌న్ లో త‌మిళ డ‌బ్బింగ్ సినిమాతో తెలుగు సినిమాల‌కు పోటీ వ‌స్తున్నారంటూ టాలీవుడ్ లో స‌రికొత్త వివాదం మొద‌లైంది.

దీనిపై స్పందించిన నిర్మాత‌ల మండ‌లి పండ‌గ సీజన్ లో తెలుగు సినిమాల‌కు మాత్ర‌మే డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని, ఆ త‌రువాతే అనువాద సినిమాల‌కు స‌పోర్ట్ చేయాలంటూ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేశారు. దీంతో వివాదం మ‌రింత ముద‌ర‌డం మొద‌లైంది. ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో త‌న సినిమా రిలీజ్ కోసం ఏర్పాట్లు మొద‌లు పెట్టిన దిల్ రాజు ప‌లు కీల‌క థియేట‌ర్ల‌కు అడ్వాన్స్ లు ఇచ్చేసి అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాడ‌ట‌.

ఇదే సీజ‌న్ లో సీనియ‌ర్ హీరోలు చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీర‌య్య‌', బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింమారెడ్డి' సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే 'వారుసుడు' కార‌ణంగా ఈ రెండు సినిమాల‌కు ప్ర‌ధాన థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ట‌. ఆ కార‌ణంగానే ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ తాజాగా దిల్ రాజు 'వార‌సుడు' కు వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై స్టార్ ప్రొడ్యూస‌ర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ స్పందించారు.

సినిమాలను అడ్డుకోవ‌డం సాధ్యం కాద‌ని, సినిమాల‌కు ఎల్ల‌లు లేవ‌న్నారు. అంతే కాకుండా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మంచి సినిమా ఎక్క‌డైనా ఆడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అల్లు అర‌వింద్ డ‌బ్బింగ్ సినిమాల విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌డంతో నిర్మాత‌ల మండ‌లి కూడా స్పందించింది. తాము డ‌బ్బింగ్ సినిమాల‌ని అడ్డుకోమ‌ని చెప్ప‌లేద‌ని, తెలుగు సినిమాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని మాత్ర‌మే చెప్పామ‌ని స్ప‌ష్టం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.