Begin typing your search above and press return to search.

నాన్న కోసం కాదు.. తమ్ముడి కోసం

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:19 AM GMT
నాన్న కోసం కాదు.. తమ్ముడి కోసం
X
‘శ్రీరస్తు శుభమస్తు’ ద్వారా హీరోగా తన తమ్ముడు శిరీష్ కు తొలి సక్సెస్ రావడం పట్ల ఆనందం పట్టలేకపోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సంబంధించి గత రెండేళ్లలో జరిగిన పరిణామాల గురించి.. శిరీష్.. పరశురామ్.. అల్లు అరవింద్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం గురించి థ్యాంక్స్ మీట్లో ఆసక్తికర విషయాలు చెప్పాడు బన్నీ.

‘‘అహంకారంతోనో.. నేనేదో మేధావి అనో చెప్పట్లేదు. నేను కొన్ని సినిమాల ఫలితాల్ని ముందే గెస్ చేయగలను. శ్రీరస్తు శుభమస్తు సినిమా చాలా మంచి సినిమా అవుతుందని ముందు నుంచి అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి ఈ సినిమా విషయంలో. గీతా ఆర్ట్స్ ఆఫీసులో పరశురామ్ గారిని చూసేవాడిని. ఆయనలో ఏ కదలికా ఉండేది కాదు. తన స్పీడును ఆపుకుని కూర్చుని పెన్ను అలా పెట్టి రాశారు. ఆయనలో ఓ పట్టుదల చూశాను. అలాంటి పట్టుదల ఉంటే ఏ సినిమా అయినా హిట్టవుతుంది. అలాగే శిరీష్ కూడా ఈ సినిమా విషయంలో ఎలా కష్టపడ్డాడో చూశాను. మేమిద్దరం మాట్లాడుకోవడం తక్కువ. కొన్నిసార్లు అర్ధరాత్రుళ్లు ఒంటిగంటకు వచ్చేవాడు. ఏడాదిగా పాటు ఇలా చాలాసార్లు చూశాను. అప్పుడే అతను ఎంత కష్టపడుతున్నాడో అర్థమైంది.

ఈ సినిమా విషయంలో నాకు యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా.. సినమా గురించి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. మనం ఎంత పబ్త్లిసిటీ చేసినా సినిమాకు రావాలో వద్దో ప్రేక్షకులు ట్రైలర్ చూసి.. ఆడియో విని ఫిక్సవుతారు. ఈ సినిమా ట్రైలర్ విషయంలో చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కొందరు పెద్ద డైరెక్టర్లు ఫోన్ చేసి నాకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా పూర్తయ్యాక రష్ చూశాను. చాలా పాజిటివ్ గా అనిపించింది. మా నాన్నకు కంగ్రాట్స్ చెప్పాను. సినిమా ఏ రేంజికి వెళ్తుందో కానీ.. సినిమా మాత్రం బాగుందని చెప్పాడు. మామూలుగా నేను ఈ సినిమాకు సంబంధించి మా నాన్న కోసం.. తమ్ముడి కోసం.. ఇద్దరి కోసం రావాలి. కానీ నా తమ్ముడి సినిమా హిట్టయిందని మాత్రమే వచ్చాను. మా నాన్న కోసం కాదు. ఏ సినిమా అయినా హిట్టయిందంటే అది కచ్చితంగా దర్శకుడి వల్లే. మిగతా వాళ్లు ఎవరెంత చేసినా.. దర్శకుడు ఎక్సెల్ అయితేనే సినిమా హిట్టవుతుంది. కాబట్టి మా తమ్ముడికి ఇలాంటి విజయాన్నందించిన పరశురామ్ గారికి మా కుటుంబం తరఫున కృతజ్నతలు చెబుతున్నా’’ అని బన్నీ అన్నాడు.