Begin typing your search above and press return to search.

చావు క‌బురు.. క‌థంతా లీక్ చేసిన బ‌న్ని..!

By:  Tupaki Desk   |   10 March 2021 5:30 AM GMT
చావు క‌బురు.. క‌థంతా లీక్ చేసిన బ‌న్ని..!
X
100 పర్సెంట్ లవ్- గీత గోవిందం- భలేభలే మ‌గాడివోయ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని అందించారు నిర్మాత‌ బ‌న్ని వాసు. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగా `చావు క‌బురు చ‌ల్ల‌గా` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవదీప్ విని క‌థ‌ను పంపిస్తే బ‌న్ని వాసు ఓకే చెప్పార‌ట‌. ఆ విష‌యాన్ని ప్రీరిలీజ్ వేడుక‌లో బ‌న్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. అంతేకాదు.. బన్ని వాసుకు క‌థ న‌చ్చ‌డం అంటే అంత ఆషామాషీ కాద‌ని అన్నారు. ఆయ‌న ఒప్పుకున్నారు అంటే ఇందులో సంథింగ్ ఉంద‌నే అర్థం.

ఇంత‌కీ చావు క‌బురు.. క‌థేంటి? అని ప్ర‌శ్నిస్తే దానికి న‌టీన‌టులు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు లీకులిస్తారో లేదో కానీ.. బ‌న్ని అస‌లు థీమ్ ఏంటో వేదిక‌పైనే లీక్ చేసేశారు. ``నేనొక్కడినే పెరిగితే సరిపోదు.. చుట్టు పక్కలా అంతా పెరగాలి!`` అంటూ వాసు సింపుల్ గా మూడు ముక్కలు చెప్పాడు! అంటూ క‌థ ఏంటో లీక్ చేసేశారు.

ఈ సినిమా చూస్తున్నపుడు ఏజ్ ఎంత అని వాసును అడిగాను.? 26 ఏళ్ళకే ఇంత మెచ్యూరిటీనా..? నాకు రెండు మూడేళ్ల కింద వచ్చిన మెచ్యూరిటీ ఈయనకు ఇప్పుడే వచ్చింది. అందరికీ హిట్ ఇవ్వబోయే దర్శకుడికి థ్యాంక్స్! అని అన్నారు బ‌న్ని..``నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి`` అంటూ ద‌ర్శ‌కుడిని అభినందించారు.

``సినిమా చూసాను..అద్దిరిపోయింది. మీరు చూడండి మీకూ నచ్చుతుంది`` అంటూ బ‌న్ని అన్న మాట‌లు ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. సినిమాలో సంథింగ్ ఏదో ఉంది అన్న బ‌జ్ ని బ‌న్ని క్రియేట్ చేశారు. మొత్తానికి ప్రీరిలీజ్ వేదిక‌పై నే బోలెడంత హైప్ తెచ్చారు బ‌న్ని. మార్చి 19న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. గ‌త కొంత‌కాలంగా కార్తికేయ ను ప‌రాజ‌యాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సినిమాతో విజ‌యం అందుకుంటాడ‌నే భావిస్తున్నారు. బ‌స్తీ బాల‌రాజుగా కార్తికేయ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించ‌నున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఈ వేదిక‌పై బ‌న్ని స్పీచ్ ఇవ్వ‌క ముందు నుంచే అల్ల‌రి మొద‌లైంది. వేడుక‌‌లో అల్లు అర్జున్ స్పీచ్ మొదలు పెట్టిన వెంటనే ఓ అభిమాని వచ్చి అతడి కాళ్లపై ప‌డ్డాడు. దండం పెట్టి మొక్కు తీర్చుకున్నాడు. ఒక్క ఫొటో అన్నా అంటూ అరిచి గోల చేశాడు. అది చూసి మిగ‌తా ఫ్యాన్స్ అంతే ర‌చ్చ చేశారు. స్పీచ్ అవ్వ‌కుండా ఆపేశారు. ఇక ఆ గుంపులో ఓ వీరాభిమాని బ‌న్నీని ప‌డేసేంత‌గా ఎగ్జ‌యిట‌యిపోయాడు. దీంతో చిత్ర‌బృందం అది చూసి షాక్ కి గురైంది.

అయితే అంత చేస్తే వేరే ఎవ‌రైనా అయితే గ‌ట్టిగా తిట్టేసేవారే. కానీ బ‌న్ని మ‌రోసారి త‌న‌దైన స్ఫూర్తివంత‌మైన స్పీచ్ తో అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాడు.``ప్రతి ఈవెంట్ ‌లోనూ ఇలా కావాలనే వస్తున్నారా ఏంటి' అంటూ నవ్వుతూనే అసహనం వ్యక్తం చేసిన బ‌న్ని.. కాసేపు గమ్మునుండండి అని అన్నారు.