Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో గెలవాలనేదే నా కోరిక: బన్నీ

By:  Tupaki Desk   |   14 Dec 2021 1:30 PM GMT
కోలీవుడ్ లో గెలవాలనేదే నా కోరిక: బన్నీ
X
అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అదే రోజున తమిళంలోను విడుదల కానుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఈ సినిమా టీమ్ చెన్నై వెళ్లింది. అక్కడి ప్రెస్ మీట్ లో తమిళంలోనే అల్లు అర్జున్ అనర్గళంగా మాట్లాడాడు. తమిళ ప్రేక్షకుల పట్ల తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు. అక్కడ ఏర్పాటు చేయబడిన ప్రెస్ మీట్ లో ఆయన ఎంతో ఆసక్తికరంగా మాట్లాడాడు.

'అల వైకుంఠపురములో' సినిమా తరువాత 'పుష్ప' సినిమాపై పూర్తి దృష్టి పెట్టాను. 'పుష్ప'రాజ్ గా మారడానికి 45 రోజులు పట్టింది. ఈ సినిమాలో ఈ పాత్ర మేకప్ కోసం 2 గంటలు పట్టేది .. మేకప్ తీయడానికి 40 నిమిషాలు పట్టేది. ఈ పాత్రకి తగిన విధంగా నన్ను నేను మార్చుకోవడానికీ .. మలచుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది.

ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ విలన్ గా చేస్తున్నారు. ఆయన యాక్టింగ్ చూసి నేను షాక్ అయ్యాను. ఆయనతో కలిసి నటించినప్పటి విశేషాలను మలయాళ వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో పంచుకుంటాను.

తెలుగులో నేను చేసిన సినిమాలు హిందీలోకి అనువాదమవుతూ ఉంటాయి. యూ ట్యూబ్ లో ఆ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అందువలన నేను ఎవరనేది బాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే తెలుసు .. వాళ్లకి నన్ను నేను పరిచయం చేసుకోవలసిన అవసరం లేదు. ఇక ఇప్పుడు నేను గెలవాల్సింది తమిళ ప్రేక్షకుల మనసులనే. ఇది నా హోమ్ స్టేట్ లాంటిది. ఇక్కడ విజయాన్ని అందుకునే సమయం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. అలాంటి అవకాశం ఈ సినిమాతో వస్తుందని అనుకుంటున్నాను.

తమిళ ప్రేక్షకుల దృష్టిని 'పుష్ప' వైపు మళ్లించింది పాటలేనని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన బాణీలు ఈ సినిమాను తమిళ ప్రేక్షకులకు చేరువగా తీసుకుని వెళ్లాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను దేవిశ్రీ ప్రసాద్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. తమిళంలో కమల్ .. ధనుశ్ .. శింబూ .. శివకార్తికేయన్ చాలా బాగా డాన్స్ చేస్తారనేది నా అభిప్రాయం. వాళ్ల సినిమాల మాదిరిగానే .. ఒక స్ట్రైట్ సినిమా మాదిరిగానే ఈ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.