Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నాలుగోసారి అల్లు అర్జున్..!

By:  Tupaki Desk   |   18 Sep 2021 5:31 PM GMT
త్రివిక్రమ్ దర్శకత్వంలో నాలుగోసారి అల్లు అర్జున్..!
X
టాలీవుడ్ లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లది మంచి సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటి వరకు వీరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. 'జులాయి' వంటి విజయవంతమైన సినిమాతో మొదలైన వీరి కాంబో.. 'సన్నాఫ్ సత్యమూర్తి' తో మరో హిట్ అందుకున్నారు. గతేడాది 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు త్రివిక్రమ్ - బన్నీల హ్యాట్రిక్ కాంబినేషన్ మరోసారి జత కట్టింది.

అయితే అది ఈసారి సినిమా కోసం కాదులెండీ.. ఓ కమర్షియల్ యాడ్ షూట్ కోసం. భారతదేశంలోని ప్రముఖ బైక్ టాక్సీ ప్లాట్ ఫారమ్ 'రాపిడో' తన వాణిజ్య ప్రకటన కోసం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లను ఎంచుకున్నారు. బన్నీ మీద తీస్తున్న ఈ యాడ్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ కాంబో.. రాపిడో యాడ్ తో మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.

షూటింగ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కమర్షియల్ గురించి అల్లు అర్జున్ కి వివరిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ ఈ ఫోటోలో ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. బనియన్ కనిపించేలా బన్నీ.. నీలి రంగు పూల చొక్కా ధరించి మెడలో తాయిత్తు.. చేతికి బ్యాండ్స్ కట్టుకుని ఉన్నాడు. ఇప్పటికే అనేక కమర్షియల్ యాడ్స్ కి పని చేసిన అనుభవం ఉన్న త్రివిక్రమ్.. బన్నీ తో కలసి రెడీ చేస్తున్న ఈ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో #SSMB28 సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.