Begin typing your search above and press return to search.

బన్నీకి ‘శ్రీరెడ్డి’ వరం

By:  Tupaki Desk   |   24 April 2018 5:00 AM IST
బన్నీకి ‘శ్రీరెడ్డి’ వరం
X
ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ‘చెప్పను బ్రదర్’ అని కామెంట్ చేశాడో కానీ.. నాటి నుంచి పవర్ స్టార్ అభిమానులకు శత్రువుగా మారిపోయాడు అల్లు అర్జున్. తన వ్యాఖ్యలపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ప్యాచప్ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అల్లు అరవింద్ సైతం ఈ విషయంలో తన ప్రయత్నాలు తాను చేశాడు కానీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అల్లు అర్జున్ సినిమాలు వచ్చినపుడు వాటి గురించి గట్టిగా వ్యతిరేక ప్రచారం చేసే స్థాయికి పవన్ ఫ్యాన్స్ వెళ్లిపోయారు. ఇలా వ్యతిరేకతను పెంచుకోవడం అన్నది అంత మంచిది కాదని బన్నీకి తెలుసు. అందుకే ఎలాగైనా పవన్ అభిమానుల్ని మళ్లీ లైన్లో పెట్టాలని.. వాళ్ల మనసులు గెలవాలని చూస్తున్నాడు బన్నీ.

అతడికి శ్రీరెడ్డి ఇష్యూ వరంలా మారింది. మొన్న పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ కు వచ్చినపుడు బన్నీ కూడా మద్దతుగా అక్కడికి వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. నిజానికి ఆ రోజు అక్కడికి రావాల్సిన అవసరం బన్నీకి కూడా లేదు. కానీ వచ్చాడు. పవన్ ను కౌగిలించుకున్నాడు. సంఘీభావం ప్రకటించాడు. అంతటితో ఆగకుండా నిన్న ‘నా పేరు సూర్య’ ఆడియో వేడుకలోనూ పవన్ ప్రస్తావన తెచ్చాడు. పవన్ ప్రత్యర్థులపై విమర్శలు చేశాడు. పవన్ కు మద్దతు ప్రకటించాడు. ఆ సందర్భంలో బన్నీ కొంచెం నాటకీయంగా మాట్లాడుతున్నట్లు కూడా అనిపించింది. ఐతే ఇక్కడ పవన్ అభిమానులతో ప్యాచప్ కోసం అతనెంత డెస్పరేట్ గా ఉన్నది కూడా స్పష్టంగా తెలిసింది. పవన్ ఫ్యాన్స్ సైతం తమ ఆరాధ్య కథానాయకుడికి ఈ సమయంలో మద్దతు అవసరమైన విషయం గుర్తించి బన్నీతో సర్దుకుపోయేలాగే కనిపిస్తున్నారు. బన్నీ విషయంలో వాళ్ల తీరు మారిందో లేదో ‘నా పేరు సూర్య’ రిలీజైనపుడు తెలుస్తుంది. వాళ్లు పాజిటివ్ ప్రచారం చేయకపోయినా నెగెటివ్ క్యాంపైన్ మొదలుపెట్టకుంటే బన్నీ విజయవంతమైనట్లే.