Begin typing your search above and press return to search.

ఈ సమయంలో ప్రయోగం అవసరమా బన్నీ?

By:  Tupaki Desk   |   29 March 2019 12:03 PM IST
ఈ సమయంలో ప్రయోగం అవసరమా బన్నీ?
X
అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య' చిత్రం తర్వాత సంవత్సరం గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ సంవత్సరంలో ఆయన ఎన్నో కథలు విన్నాడు, ఎంతో మంది దర్శకులతో చర్చలు జరిపాడు. కాని చివరకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాకు కమిట్‌ అయ్యాడు. నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్‌ వల్ల కలిగిన నష్టంను భర్తీ చేసుకునేందుకు వరుసగా మూడు నాలుగు మంచి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను చేయాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడు. అందుకే కాస్త ఆలస్యం అయినా త్రివిక్రమ్‌ కోసం వెయిట్‌ చేసి మరీ మాటల మాంత్రికుడితో మూడవ సారి జత కట్టబోతున్నాడు.

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ త్వరలో పట్టాలెక్కబోతుంది. బన్నీ మూవీని ఇదే ఏడాదిలో విడుదల చేసేలా ప్రతివిక్రమ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్‌ తర్వాత అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడని సమాచారం అందుతోంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా, ఈయన దిల్‌ రాజు ప్రొడక్షన్‌ కాంపౌండ్‌ దర్శకుడు. అప్పుడెప్పుడో 'ఓమై ఫ్రెండ్‌' చిత్రాన్ని చేసి ఫ్లాప్‌ ను చవిచూసిన వేణు శ్రీరామ్‌ చాలా కాలం తర్వాత నానితో 'ఎంసీఏ' చిత్రాన్ని చేశాడు. ఎంసీఏ చిత్రం ఒక మోస్తరుగా ఆడినా అది నాని వల్లే అనే టాక్‌ వచ్చింది.

అలాంటి వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా చేసేందుకు కమిట్‌ మెంట్‌ ఇచ్చాడట. ఈ విషయమై మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది. దిల్‌ రాజు బ్యానర్‌ లో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బన్నీ సినిమాను చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వేణు శ్రీరామ్‌ చెప్పిన స్టోరీ లైన్‌ కు బన్నీ ఇంప్రెస్‌ అయ్యాడని, త్రివిక్రమ్‌ మూవీ చేసిన తర్వాత చేద్దామని ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు పరిస్థితి బాగాలేని ఈ సమయంలో ప్రయోగం అవసరమా అంటూ మెగా ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.