Begin typing your search above and press return to search.

బన్నీ ఫ్లోనా సీరియస్సా?

By:  Tupaki Desk   |   16 July 2018 6:14 AM GMT
బన్నీ ఫ్లోనా సీరియస్సా?
X
నిన్న జరిగిన విజేత సక్సెస్ మీట్ లో వన్ అండ్ ఓన్లీ అట్రాక్షన్ గా ఉంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే. సినిమా గురించి నిర్మాత సాయి కొర్రపాటి గురించి ప్రత్యేకంగా అభినందించిన బన్నీ ఫాదర్ సెంటిమెంట్ వల్లే తనకు విజేత బాగా నచ్చిందని చెప్పడం ఆకట్టుకుంది. ఇక తన స్పీచ్ లో భాగంగా వారాహి బ్యానర్ లో చాలా మంచి సినిమాలు వస్తాయని సరైన సబ్జెక్ట్ కనక కుదిరితే ఇందులో ఓ సినిమా చేయాలనుందని చెప్పేసాడు. నిజానికి సాయి కొర్రపాటి బాలకృష్ణ మినహా స్టార్ హీరోతో ఇంత వరకు డీల్ చేయలేదు. లెజెండ్ కూడా 14 రీల్స్ సంస్థ భాగస్వామ్యంతో నిర్మించారు. ఇప్పుడు తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా హీరోతో పాటు మరో పార్టనర్ కూడా ఉన్నాడు. ఆయన తన సింగల్ కార్డు మీద తీసినవన్నీ బడ్జెట్ లో రిస్క్ లేకుండా చిన్న తారలతో తీసినవి. కాకపోతే ఫామిలీ ఆడియన్స్ ని మెప్పించే కథలు తీస్తారని మంచి పేరైతే ఉంది.

మరి అల్లు అర్జున్ అదే పనిగా సాయి బ్యానర్ లో చేస్తానని చెప్పడం ఫ్లోనా లేక నిజంగా మనసులో మాట చెప్పాడా అని అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడం సహజం. మొన్నోసారి తేజ్ ఐ లవ్ యు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి నిర్మాత కెఎస్ రామారావుతో చరణ్ త్వరలోనే ఓ సినిమా చేస్తాడని ప్రకటించేసారు. ప్రాక్టికల్ గా అది జరగడానికి చాలా టైం పడుతుంది. పైగా ఇప్పుడు సాయి కొర్రపాటి అల్లు అర్జున్ తో సినిమా తీయాలన్నా కథ మొదలుకుని దర్శకుడి దాకా చాలా కసరత్తు చేయాలి. మరి బన్నీ అన్న ఆ హామీని ఉపయోగించుకునేలా సాయి కాస్త వేగంగా మూవ్ అయితే బెటర్. నా పేరు సూర్య రిజల్ట్ దెబ్బకు తన కొత్త సినిమా ఇప్పటి దాకా మొదలుపెట్టని బన్నీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అది తానుగా బన్నీ చెప్పడం లేదు. అయినా పట్టాలు ఎక్కడం ఖాయమే. మరి వారాహి సినిమాలు ఇష్టపడే బన్నీ అందులో సినిమా చేయడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. కథ తీసుకురావడమే ఆలస్యం. సాయి కొర్రపాటి త్వరపడాలి.