Begin typing your search above and press return to search.

బన్నీ షట్టర్ క్లోజేనా?

By:  Tupaki Desk   |   10 May 2018 5:30 PM GMT
బన్నీ షట్టర్ క్లోజేనా?
X
అల్లు అర్జున్ సినిమా వస్తోందంటే దానికి పోటీగా వేరే సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడతారు. ఆ చిత్రానికి ముందు.. వెనుక వారాల్లో వచ్చే సినిమాలకూ ఇబ్బందులు తప్పవు. గత కొన్నేళ్లలో తన ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ బాగా పెంచుకుని పెద్ద రేంజికి వెళ్లిపోయాడు బన్నీ. టాలీవుడ్లో అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకునే హీరోల్లో అతనొకడు. కాబట్టి బన్నీకి ఎదురెళ్లడానికి వేరే సినిమాల వాళ్లు భయపడతారు. అతడి సినిమాల వల్ల వేరే చిత్రాలకే పంచ్ పడుతూ ఉంటుంది మామూలుగా. కానీ ఇప్పుడు కథ మారింది. వేరే సినిమాలు బన్నీ సినిమాకు ఎసరు పెట్టే పరిస్థితి వచ్చింది. గత శుక్రవారం రిలీజైన అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’కు డివైడ్ టాక్ వచ్చింది. వీకెండ్లో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. వారాంతం తర్వాతైతే బాగా పడిపోయాయి వసూళ్లు. ఐతే ఈ చిత్రంపై భారీ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

రెండు వారాలైనా వసూళ్లు నిలకడగా ఉండాలి. వీక్ డేస్ లో వీక్ అయినా.. వీకెండ్లో అయినా సినిమా పుంజుకుంటుందని.. చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తుందని నిర్మాతలు.. బయ్యర్లు ఆశించారు. కానీ అలాంటి ఆశలేమీ కనిపించడం లేదు. మే 9 సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని బుధవారానికే ‘మహానటి’ని థియేటర్లలోకి తెచ్చేసింది వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ రావడంతో వసూళ్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఒక్కసారిగా ప్రేక్షకులంతా ఈ సినిమా వైపు మళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. అక్కడ ప్రీమియర్లకు అదిరే రెస్పాన్స్ వచ్చింది. మామూలుగానే బన్నీ ఓవర్సీస్ మార్కెట్లో వీక్. ‘మహానటి’కి మంచి టాక్ వచ్చేసరికి ఇక చెప్పేదేముంది? మంగళవారం నుంచే దీనికి పంచ్ పడింది. అక్కడ దాదాపుగా ఈ సినిమాకు దారులు మూసుకుపోయాయి. ‘మహానటి’ దెబ్బ చాలదన్నట్లు ‘మెహబూబా’ కూడా వస్తోంది. కాబట్టి వీకెండ్ వసూళ్లు నామమాత్రంగా ఉండి బయ్యర్లకు భారీ నష్టాలు తప్పకపోవచ్చు.